పట్టించుకోవడం లేదు
● అధ్వానంగా వృద్ధాశ్రమానికి వెళ్లే దారి
● బురదలో ఇరుక్కుపోయిన నీటి వాహనాలు
● నీళ్లు లేక ఇబ్బందిపడ్డ వృద్ధులు
కామారెడ్డి టౌన్ : వయసు మళ్లిన వృద్ధుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారతాయనడానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ ఏజ్ హోం పరిస్థితులే ప్రత్యక్ష నిదర్శనం. ఒకవైపు నడవలేని రోడ్లు.. మరోవైపు తాగునీరు లేక అవస్థలు పడుతున్న వృద్ధుల వేదన చూసేవారి కళ్లు చమ్మగిల్లక తప్పదు. హోంకు వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో నడవలేని పరిస్థితి నెలకొంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధురాలిని శనివారం ఆస్పత్రికి తరలించేందుకు వాహనాలు రాలేకపోయాయి. దీంతో చేసేది లేక సిబ్బంది ఆమెను కుర్చీలో కూర్చోబెట్టుకుని, ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని బురద బాటలోనే ప్రధాన రహదారి వరకు మోసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో అత్యవసర పరిస్థితి వస్తే వృద్ధుల ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వృద్ధాశ్రమాన్ని తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. బురదమయంగా మారిన దారిలో మినరల్ వాటర్ సరఫరా చేసే ఆటో, నీటి ట్యాంకర్ రాలేకపోతున్నాయి. బురద బాటలో దిగబడుతున్నాయి. శనివారం వాటర్ ట్యాంకర్‌తోపాటు మినరల్ వాటర్ ఆటో బురదలో ఇరుక్కుపోయాయి. నీటి సరఫరా లేకపోవడంతో హోం ముందున్న ఖాళీ స్థలంలో నిలిచిన వర్షపు నీటిలోనే వృద్ధులు తిన్న కంచాలు కడుక్కుంటున్న దృశ్యాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. ఈ సమస్యలన్నీ ఒక్క శనివారం రోజునే దర్శనమిచ్చాయి. ఇప్పటికై నా హోంకు వెళ్లే దారిని బాగు చేయాలని పలువురు కోరుతున్నారు.
వృద్ధాశ్రమానికి వెళ్లే దారి నరకప్రాయంగా ఉందని మున్సిపల్, ఉన్నతాధికారులకు వి న్నవించినా పట్టించుకోవడం లేదు. మొరం పోయించండని మొర పెట్టుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. వర్షపు నీటిలో పల్లాలు శుభ్రం చేసుకుంటున్నారు. నేనే నీటిని తెప్పించాను.
– సురోజు వనిత, 15వ వార్డు కౌన్సిలర్


