ఎల్లారెడ్డి: మండలంలోని వెల్లుట్ల గ్రామంలో కల్తీకల్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు. వెలుట్ల గ్రామంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఈగల్ టీం బృందం దాడులు నిర్వహించగా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. తనిఖీల్లో దుకాణంలో ఉన్న కల్లు విక్రయిస్తున్న సాతెల్లి నాగేశ్వర్ గౌడ్ ను, అదుపులోకి తీసుకోగా వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రాథమిక విచారణలో కల్లులో అల్ప్రాజోలామ్ మత్తు పదార్థాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు వెల్లడైందన్నారు. అదే సమయంలో దుకాణంలో కల్లు సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో బెంజోడయాజైపెన్ పాజిటివ్‌గా తేలిందన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. అనంతరం కల్లు విక్రయదారుడితో పాటు లైసెన్స్ హోల్డర్ మాస గౌడ్ ను సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై–2 సుబ్రహ్మణ్య చారి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.


