పాఠశాల తనిఖీ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్‌పేట్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సర్పంచ్ షేక్ ఉమర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థన సమయానికి పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు మా త్రమే హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రార్థన సమయానికి హాజరు కావాలని సూచించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
దివ్యాంగులు స్వయం ఉపాధి పొందాలి
మాచారెడ్డి: దివ్యాంగులు స్వయం ఉపాధిని పొందుతూ సమాజంలో గౌరవంగా జీవించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని ఏపీడీ విజయ లక్ష్మీ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో సెర్ప్, రెడ్డి ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యంగులకు స్వయం ఉపాధికి సంబందించిన రివాల్వింగ్ ఫండ్ అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ప్రతి ఒక్క దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ. 25వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డీపీఎం శ్రీనివాస్, రవీందర్, రెడ్డి ల్యాబ్స్ సిబ్బంది, సీసీ, లబ్ధిదారులు ఉన్నారు.
30వ సారి రక్తదానం
ఎల్లారెడ్డిరూరల్: పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణ బీబీపేటలో రక్తదాశిబిరంలో శుక్రవారం 30వ సారి రక్తదానం చేశాడు. వెంకటరమణతో పాటు అతడి ఇద్దరు కుమారులు మూడు నెలలకొక సారి రక్తదానం చేయడం గొప్పవిషయమని శిబిరానికి హాజరైన జిల్లా సివిల్ కోర్టు న్యాయమూర్తి నాగరాణి అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌గుప్తా తదితరులు హాజరయ్యారు. అనంతరం అతడికి రక్తదాన పత్రాన్ని అందించారు.
నేడు పీఆర్‌టీయూ సర్వసభ్య సమావేశం, ఎన్నికలు
కామారెడ్డి అర్బన్: పీఆర్‌టీయూ టీఎస్ కామారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నికను శనివారం లింగాపూర్ బృందావన్ గార్డెన్‌లో నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లాపూర్ కుశాల్, పుట్ట శ్రీనివాస్‌రెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, భిక్షంగౌడ్ తదితరులు హాజరు కానున్నట్టు, జిల్లాలోని పీఆర్‌టీయూ ప్రాథమిక సభ్యులందరు హాజరు కావాలని కోరారు.


