ప్రజావాణి మండలాల్లోనే వింటారు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి మండలాల్లోనే వింటారు

Aug 7 2026 1:26 AM | Updated on Aug 7 2026 1:26 AM

ప్రజావాణి మండలాల్లోనే వింటారు

ఆన్‌లైన్‌లో నమోదు..

23 శాఖల అధికారులు హాజరుకావాల్సిందే..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రభుత్వం మార్పులు తీసుకువస్తోంది. దూర ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గత మే 4న రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు ఆదేశాలు జారీచేసింది. దాన్ని మరింత విస్తరించే క్రమంలో మండల స్థాయి ప్రజావాణి నిర్వహణకు ఈ నెల 4న జీవో విడుదల చేసింది. స్థానికంగా ఉన్న మండల పరిషత్‌ కార్యాలయంలో ప్రజలు అధికారులకు తమ సమస్యలు చెప్పుకుంటే సరిపోతుంది. ప్రతీ సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ నోడల్‌ అధికారిగా ఎంపీడీవో వ్యవహరిస్తారు.

జూమ్‌ ద్వారా పర్యవేక్షించనున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ ప్రతీ సోమవారం ప్రజావాణిలో ఆయా మండలాల అఽధికారులతో జూమ్‌ ద్వారా మాట్లాడేవారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజా సమస్యలపై అధికారులకు గైడ్‌ చేసేవారు. గత సోమవారం ఓ రైతు సమస్యను జూమ్‌ కాల్‌ ద్వారా మాట్లాడి పరిష్కరించారు. ఇప్పుడు అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహించనున్న నేపథ్యంలో మండల అధికారులంతా అందులో పాల్గొంటారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ జూమ్‌, వీడియో ద్వారా మండల స్థాయి ప్రజావాణిని పర్యవేక్షించనున్నారు.

ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అప్పటికప్పుడే పరిష్కరించాలి. అలాగే ప్రతీ దరఖాస్తును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, దరఖాస్తుదారుడికి రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. మండల స్థాయిలో పరిష్కారమయ్యే అన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి 120 నుంచి 150 వరకు దరఖాస్తులు వస్తున్నాయి.

మండల స్థాయి ప్రజావాణికి 23 శాఖల అధికారులు హాజరుకావాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), తహసీల్దార్‌, పంచాయతీ, వ్యవసాయ, హార్టికల్చర్‌, మత్స్యశాఖ, పశుసంవర్ధక, విద్యాశాఖ, వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతోపాటు డిప్యూటీ తహసీల్దార్‌, మండల గృహ నిర్మాణ అధికారి/అసిస్టెంట్‌ ఇంజినీర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, ఆర్‌అండ్‌బీ డీఈ/ఏఈ, ఇరిగేషన్‌ ఏఈ, గ్రౌండ్‌ వాటర్‌ ఆఫీసర్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌/బీట్‌ ఆఫీసర్‌, విద్యుత్‌ ఏఈ, మున్సిపల్‌ కమిషనర్‌ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రతీ సోమవారం ఉదయం 10 నుంచి

మధ్యాహ్నం 1 గంట వరకు

మండల పరిషత్‌ కార్యాలయంలో

నిర్వహణకు ఏర్పాట్లు

నోడల్‌ అధికారిగా ఎంపీడీవో

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement