● ప్లాస్టిక్ రహిత గ్రామాలే
ఆరోగ్యకర సమాజానికి పునాది
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్‌లో ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతోందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని దెబ్బతీయడంతోపాటు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని తెలిపారు. జ్యూట్ సంచుల వినియోగం పర్యావరణ హితమని, ఇవి పునర్వినియోగానికి అనుకూలంగా ఉండటంతోపాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని సూచించారు. మార్కెట్‌కు వెళ్లేటప్పుడు జ్యూట్ సంచులను తప్పనిసరిగా వినియోగించి, ప్లాస్టిక్ సంచులకు పూర్తిగా స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్‌ను నిషేధించడంలో ఇప్పటికే ఎండ్రియాల్ ఆదర్శ గ్రామంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింహులు, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, రెడ్డి, ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులను కలెక్టర్ సన్మానించారు. అనంతరం ఎర్రాపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. తల్లి పాల వారోత్సవాలలో పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థలు కలెక్టర్ గిరి, డీఆర్డీవో దామోదర్, ఎంపీడీవో భరత్‌కుమార్, తహసీల్దార్ శ్వేత, డీఎంహెచ్‌వో వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


