నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు పోచారం ప్రాజెక్టు, ఘనపురం ఆనకట్ట అలుగుల ద్వారా నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 3,565 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి 1,398.67 అడుగుల (9.984 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు.
కౌలాస్‌లోకి 350 క్యూసెక్కులు..
జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి గురువారం 350 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. 456.55 మీటర్ల (0.910 టీఎంసీ) నీరు నిల్వ ఉందన్నారు.
నేడు పోచారం నీటి విడుదల
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు నుంచి శుక్రవారం నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో ఖరీఫ్ పంటల సాగు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 15 రోజులపాటు నీటిని విడుదల చేస్తామని, తర్వాత పది రోజులు నిలిపివేస్తామని.. ఇలా నాలుగు విడతలపాటు ఆయకట్టుకు నీరందిస్తామని తెలిపారు.


