జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వేదిక, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చూసుకోవాలన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, పథకాల స్టాళ్లు, శకటాల ప్రద ర్శన తదితర వాటిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర జిల్లా ప్రగతి నివేదికను సిద్ధం చేయాలని జిల్లా ప్రణాళికాధికారిని ఆదేశించారు. ప్రోటోకాల్ నిబంధనలను పాటిస్తూ ప్రజాప్రతినిధులు, విశిష్ట అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.


