పాల్వంచ వాగు పరిశీలన
డోంగ్లీ శివారులో నీట మునిగిన పంటలు
జిల్లాపై వరుణుడి కరుణ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అంతటా జలకళ సంతరించుకుంది. చెరువులు, కుంటలతోపాటు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మద్నూర్, డోంగ్లీ మండలాల్లో దాన్ని ప్రభావం కనిపిస్తోంది. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి –మల్లుపల్లి గ్రామాల మధ్యనున్న వాగు, రామారెడ్డి మండలంలో కన్నాపూర్ వాగు పొంగుతుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంగమ్మ వాగులో నీటి ప్రవాహం పెరగడంతో రామారెడ్డి నుంచి కామారెడ్డికి ఇప్పటికే రాకపోకలు నిలిపివేశారు. భీమేశ్వర వాగు, పెద్దవాగు, పాల్వంచ వాగు, ఎడ్ల కట్టవాగులు ప్రవహిస్తున్నాయి. కల్యాణి వాగు ప్రాజెక్టులోకి వరద వస్తుండడంతో రెండు గేట్ల ద్వారా నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు.
చెరువులకు జలకళ...
చెరువులు, కుంటలలోకి నీరు చేరుతోంది. దీంతో మొన్నటి దాకా చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులు, కుంటలు జలకళ కనబడుతోంది. వర్షాలతో వా నాకాలంలో సాగు చేసిన పంటలకు ఊపిరి వచ్చినట్టయ్యింది. పంట చేలు కళకళలాడుతున్నాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పలుచోట్ల నాట్ల లో నిమగ్నమయ్యారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించింది.
మాచారెడ్డి: ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం పాల్వంచ వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగుల వరదల వద్ద సెల్ఫీల కోసం ఆరాటపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఏదైనా ప్రమాదానికి గురవుతున్నామని భావించినప్పుడు డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
జిల్లావ్యాప్తంగా వర్షాలు
చెరువులు, కుంటల్లోకి చేరుతున్న నీరు
పొంగి ప్రవహిస్తున్న వాగులు
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు


