‘కల్యాణి’కి కొనసాగుతున్న వరద | - | Sakshi
Sakshi News home page

‘కల్యాణి’కి కొనసాగుతున్న వరద

Jul 31 2026 12:51 AM | Updated on Jul 31 2026 12:51 AM

‘కల్యాణి’కి కొనసాగుతున్న వరద

ఎల్లారెడ్డి: తిమ్మారెడ్డి శివారులోని కల్యాణి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోందని నీటిపారుదల శాఖ అధికారులు గురువారం తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. బుధవారం రెండు వరద గేట్ల ద్వారా నీటిని మంజీరలోకి విడుదల చేయగా, గురువారం ఉదయం నాటికి వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటును మూసివేశారు. మళ్లీ వరద ఉధృతి పెరగడంతో రెండు గేట్లను ఎత్తి మంజీరలోకి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుకు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా 180 క్యూసెక్కులు నిజాంసాగర్‌ ప్రధాన కాలువకు మళ్లిస్తుండగా, మిగతా 220 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి వదిలినట్లు అధికారులు తెలిపారు.

నిజాంసాగర్‌లోకి 3,935 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు మెదక్‌ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుండడంతో గురువారం నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 3, 935 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1,395.92 అడుగుల (7.53 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

‘కౌలాస్‌’లోకి 925 క్యూసెక్కులు..

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి 925 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి 455 మీటర్ల (0.628 టీఎంసీ) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నాలుగో రోజుల్లో 0.19 ఎమ్‌సీఎఫ్‌టీల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చిందన్నారు.

‘పోచారం’లోకి 2,373 క్యూసెక్కులు..

నాగిరెడ్డిపేట: ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో పోచారం ప్రాజెక్టులోకి గురువారం 2,373 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ఇరిగేషన్‌ ఏఈ అక్షయ్‌కుమార్‌ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రానికి 0.683 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement