కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి కాపాడే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రహవీర్, పీఎం రహత్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు స్పందించి బాధితులను సమీప ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లోపు ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేలు నగదు బహుమతి అందిస్తుందన్నారు. ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా ఐదుసార్లు బహుమతి పొందవచ్చని పేర్కొన్నారు. పీఎం రహత్ పథకంలో భాగంగా ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందన్నారు. ఈ విషయాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, డీటీవో సంతోష్ కుమార్, డీఎంహెచ్‌వో వెంకటేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులందరూ అందుబాటులో ఉండాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా, అందుబాటు లో ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మండలాల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. సమస్యల పరిష్కారం, సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08468–220069 కు ఫోన్‌చేయాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను రక్షించేందుకు రోప్స్, డ్రోన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కల్వర్టులు, కుంటల వద్ద సూచిక బోర్డులు పెట్టాలని సూచించారు. హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు సంబంధించిన పైకప్పు లీకేజీలకు మరమ్మతులు, ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ప్రజలు నివాసం ఉండకుండా చూడాలన్నారు. విద్యుత్ సమస్యలు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, పాము కాటు, అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల మందులను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, జెడ్పీ సీఈవో చందర్ తదితరులు పాల్గొన్నారు.


