ఎటు వెళ్లానో.. ఎలా వెళ్లానో..
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన బక్కన్నగారి నర్సవ్వ, బాలయ్యలకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు రాజు ఇంటర్ మొదటి సంవత్సరంతో చదువు ఆపేసి స్నేహితులతో కలిసి కామారెడ్డి పట్టణ సమీపంలోని గ్రానైట్ కంపెనీలో పనిచేసేవాడు. ఓ రోజు రాయి తగలడంతో తలకు గాయమై మానసికంగా దెబ్బతిన్నాడు. 2012 సంవత్సరంలో ఎడ్ల పొలాల అమావాస్య రోజు వేకువజామున ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా రాజు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. కొడుకు ఏమయ్యాడోనని అతడి తల్లి ఏడవని రోజు లేదు.
మహారాష్ట్రకు చేరిన రాజు..
మానసిక స్థితి సరిగా లేని రాజు.. మహారాష్ట్రలోని పుణె జిల్లా భోర్ పట్టణానికి చేరాడు. అక్కడ ద్వారకామాయి హోటల్ నిర్వాహకుడు ప్రకాశ్ మగందే అతడిని చేరదీసి పని కల్పించి సొంత మనిషిలా చూసుకున్నాడు. మరాఠీ నేర్చుకున్న రాజు.. క్రమంగా తెలుగు మరిచిపోయాడు. కరోనా కాలంలో తల్లిదండ్రులు, స్నేహితులు, చిన్ననాటి విషయాలు కొంత గుర్తుకు వచ్చినా.. తన ఊరు ఎక్కడో మాత్రం అర్థం కాలేదు. ఏడాదిన్నర క్రితం రాజు పనిచేస్తుండగా తలకు దెబ్బతగలడంతో కిందపడిపోయాడు. హోటల్ యజమాని వైద్యం చేయించాడు. కోలుకున్నాక అతడికి తల్లిదండ్రులు, చిన్ననాటి దోస్తుల వివరాలు కొంత గుర్తుకు రావడంతో విషయాన్ని హోటల్ యజమానికి వివరించాడు. ఊరెక్కడో కనుక్కొని పంపిస్తానని యజమాని చెప్పాడు.
మూడంకెల కోసం నెలల తరబడి ప్రయత్నం..
సొంతవారిని చేరడానికి రాజు తన స్నేహితుడు శ్యామ్ ఫోన్ నంబర్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. పది అంకెల్లో మొదటి ఏడు అంకెలు మాత్రమే గుర్తుకువచ్చాయి. చివరి మూడు అంకెల కోసం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం చివరి మూడు అంకెలను మార్చి మార్చి ప్రయత్నించగా.. ఆ రోజు 22వ ప్రయత్నంలో శ్యామ్‌కు కాల్ కనెక్ట్ అయ్యింది. అయితే మరాఠీ భాషలో మాట్లాడడంతో శ్యామ్‌కు ఏమీ అర్థం కాలేదు. వీడియో కాల్ ద్వారా రాజును గుర్తించిన శ్యామ్.. అతడి తల్లి నర్సవ్వతోనూ మాట్లాడించాడు. హోటల్ యజమాని ద్వారా అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి రాజును తీసుకొని బుధవారం రాత్రి అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చేరుకున్నారు. 14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు తిరిగి తన దగ్గరికి చేరడంతో తల్లి నర్సవ్వ ఆనందానికి అవధుల్లేవు.
హిందీ, మరాఠీ భాషల్లో మాట్లాడుతున్న రాజు.. తెలుగులోనూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత వరకు చదివావని అడిగితే నాలు గో తరగతి అంటుండగా.. అతడి స్నేహితులు పదో తరగతి మెమోను చూపించడంతో ఆలోచనలో పడ్డాడు. రాజును ‘సాక్షి’ పలకరించగా.. అప్పుడు తాను ఎటు వెళ్లానో, ఎలా వెళ్లానో కూడా గుర్తులేదని, పుణె అవతల భోర్‌లో ఉన్న హోటల్‌లో చాలాకాలంగా పనిచేస్తున్నానని తెలిపాడు. తనను హోటల్ యజమాని కొడుకులా చూసుకున్నాడని వివరించాడు.
ఓ ప్రమాదం మతిస్థిమితం లేకుండా చేయగా.. మరో ప్రమాదం జ్ఞాపకాలను తట్టిలేపింది. తలకు తీవ్ర గాయమై మానసికంగా దెబ్బతిని ఇల్లు విడిచివెళ్లిన ఆ యువకుడు.. 14 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి చేరాడు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
తలకు దెబ్బతగిలి మతిస్థిమితం
కోల్పోయిన జిల్లావాసి
ఇల్లు వదిలి మహారాష్ట్రలోని
భోర్ పట్టణానికి చేరిక
చేరదీసి పనికల్పించిన
హోటల్ యజమాని
మరోసారి తలకుగాయం కావడంతో
గుర్తుకొచ్చిన గతం
14 ఏళ్లకు తిరిగొచ్చిన యువకుడు


