సదాశివనగర్: అన్ని గ్రామాల్లో భూగర్భ జలాల అభివృద్ధికి కృషి చేయాలని డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. మండలంలో జరిగిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్, ఎంపీవో సురేందర్‌రెడ్డి, ఏపీవో శ్రీనివాస్, టీఏలు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో శుక్రవారం జరగాల్సిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పర్యటన రద్దయ్యింది. సర్‌పై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీతక్క పర్యటన రద్దయ్యిందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
కామారెడ్డి టౌన్ : కామారెడ్డిలో శుక్రవారం ‘మై భారత్’ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి రమేష్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్‌కే డిగ్రీ కళాశాలలో పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌కే డిగ్రీ కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. జానపద గేయాలు, జానపద నృత్యం, రీల్స్/షార్ట్ ఫిల్మ్, నాటికలు, కవిత్వం, వక్తృత్వం, స్లోగన్, పెయింటింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సమయానికి హాజరై పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల, యువజన అధికారి రంగా వెంకటేశ్వర్‌గౌడ్, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్, ప్రోగ్రాం ఆఫీసర్లు అంజయ్య, హరిత తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకోసం జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో మల్లికార్జున్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, రెసిడెన్షియల్, మోడల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, తత్సమాన కేడర్ ఉపాధ్యాయులతో పాటు, పీజీటీ, టీజీటీల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని పేర్కొన్నారు. దరఖాస్తు నమూనా, సూచనలను స్థానిక ఎంఈవోల కార్యాలయం నుంచి పొందవచ్చని, ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
కామారెడ్డి టౌన్ : మానవ అక్రమ రవాణా సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని, దానిపై యువత నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న సూచించారు. మిషన్ శక్తి పథకంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్‌కే డిగ్రీ కళాశాలలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రంల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రగ్స్, సెల్‌ఫోన్ వ్యసనానికి దూరంగా ఉంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, మహిళలు–పిల్లల రక్షణ చట్టాలపై న్యాయవాది సిద్ధిరాములు అవగాహన కల్పించారు. కళాజాత బృందం ఆటపాటల ద్వారా చైతన్యపరిచారు. కార్యక్రమంలో కళాశాల సీఈవో జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నవీన్, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.


