కామారెడ్డి అర్బన్: కామారెడ్డి తహసీల్ కార్యాలయం కుంభకర్ణ నిద్రను వీడింది. ఏడాది క్రితం ప్రచురితమైన కథనానికి తాపీగా ఈనెల 28న వివరణ ఇచ్చింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి తహసీల్ కార్యాలయంలో అధికారులు కనిపించడం లేదన్న అంశంపై గతేడాది జూలై 26న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై అప్పటి తహసీల్దార్ జనార్దన్ స్పందించలేదు. తర్వాత ఆయన బదిలీపై వెళ్లారు. సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత ప్రస్తుత తహసీల్దార్ హిమబిందు ఆ కథనానికి స్పందించారు. సాక్షి వార్త క్లిప్పింగ్‌ను జతచేస్తూ కలెక్టర్, ఆర్డీవోలకు ఈనెల 28న వివరణ పంపించారు. గతేడాది జూలై 25న సిబ్బంది రెవెన్యూ సదస్సుల విధుల్లో ఉన్నారని ఆ వివరణలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కాలేదని, అదే రోజు సాయంత్రం పూర్తి చేశామని, నిర్లక్ష్యం చేయలేదని వివరణ ఇచ్చారు. ఓ కథనంపై అధికారులు ఏడాది తర్వాత స్పందించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


