● క్రెడిట్ కార్డుల ద్వారానే రుణ సౌకర్యం
● అర్హత ఉన్నా పీఎం స్వనిధి పథకానికి దూరమవుతున్న పరిస్థితి
ఎల్లారెడ్డి : చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీధి వ్యాపారులు సిబిల్ స్కోర్ లేని కారణంగా పీఎం స్వనిధి పథకానికి దూరమవుతున్నారు. వీధి వ్యాపారులకు తాము చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలకు పెట్టుబడి కోసం ఆత్మ నిర్భర్ భారత్ కింద మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధి పథకాన్ని 2020లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం పెట్టుబడి సహాయం కోరే వీధి వ్యాపారులకు మొదటి విడతగా రూ. 15 వేలు, రెండో విడతగా రూ. 25 వేలు, మూడో విడతగా రూ. 50 వేల రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తుంది. తాము తీసుకున్న మొదటి, రెండవ విడత రుణాలను సక్రమంగా చెల్లించిన వీధి వ్యాపారులకు రూ. 50 వేల రుణాలను అందించడానికి బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ రుణాలను బ్యాంకు ఖాతాలలో కాకుండా క్రెడిట్ కార్డుల ద్వారా అందించనున్నారు. రుణ సదుపాయం పొందే వీధి వ్యాపారులకు సిబిల్ స్కోర్ బాగుంటేనే క్రెడిట్ కార్డులు అందిస్తామని బ్యాంకర్లు కండీషన్ పెడుతున్నారు.
2020లో కరోనా లాక్‌డౌన్ కారణంగా వీధి వ్యాపారులు తాము మొదటి, రెండవ విడతలలో తీసుకున్న రుణాలను సక్రమంగా కట్టలేక పోయారు. దీంతో వీరి సిబిల్ స్కోర్ 650 దాటడం లేదని తెలిసింది. సిబిల్ స్కోర్ లేని కారణంగా స్వనిధి పథకానికి అర్హత ఉన్నా 80 శాతం మంది వీధి వ్యాపారులకు రుణాలు అందడం లేదు. పాత రుణాలను సక్రమంగా చెల్లించిన ఏదో కొద్ది మందికి మాత్రమే ఈ పథకం అర్హత లభిస్తుంది.
పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలను అందించేందుకు సిబిల్ అవసరం లేదని పథకం మార్గదర్శకాలు ఉన్నాయి. కాగా, బ్యాంకర్లు మాత్రం సిబిల్ స్కోరే ప్రామాణికమని, రుణం ఇవ్వట్లేదు.ఈవిషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బ్యాంకర్లకు ఆదేశాలివ్వాలి.
–శ్రీధర్‌రెడ్డి, మెప్మా పీడీ, కామారెడ్డి
మార్గదర్శకాలు ఇలా..
వీధి వ్యాపారులకు పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించే కేంద్ర ప్రభుత్వ పీఎం స్వనిధి పథకానికి సిబిల్ స్కోర్ ప్రామాణికం కాదని మార్గ దర్శకాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కొన్ని బ్యాంకులు సిబిల్ స్కోర్ లేనిదే రుణాలను ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నాయి. గతంలో తీసుకున్న రుణాలు చెల్లించక వారి అకౌంట్లు ఎన్‌పీఏ (నాన్ పెరఫార్మెన్స్) అకౌంట్లుగా మారితేనే లోన్లు తిరస్కరించొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు లోన్లు వచ్చేలా చేయాలని వీధి వ్యాపారులు కోరుతున్నారు.


