నిజాంసాగర్(జుక్కల్): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ 14 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని ఒడ్డేపల్లి, మల్లూర్, బ్రహ్మణపల్లి, అచ్చంపేట, బంజపల్లి, గ్రామాలకు లబ్ధిదారులకు అందజేశారు. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి, తహసీల్దార్ సాయిభుజంగరావు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): గత మూడు రోజులుగా రాత్రి వేళ కు రుస్తున్న వ ర్షాలకు పెద్దవాగు ప్రవహిస్తుంది. సోమవారం ఉదయం నాగారం వరకు చేరుకున్న పెద్దవాగు ప్రవాహం మంగళవారం ఉదయం లింగంపేట వంతెన దాటి శెట్పల్లి శివారులోకి ప్రవేశించింది. మడుగులు నిండుకుంటూ పోచారం వైపు ప్రహిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. పెద్దవాగు ప్రవహిస్తే గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి తండాకు వెళ్లే రోడ్డు బురదమయం కావడంతో గిరిజనులు మంగళవారం నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దశాబ్దాలుగా తమ రోడ్లు బాగు చేయాలని మొరపెట్టుకుంటున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శెట్పల్లి రోడ్డు నుంచి రెండు కిలో మీటర్ల వరకు రోడ్డు బురదతో నిండిపోయి నడవడానికి సైతం నరక యాతన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బీటీ రోడ్డు వేయాలని గిరిజనులు కోరుతున్నారు.
కామారెడ్డి టౌన్ : ఈ నెల 23న జరగనున్న మున్సిపల్ సాధారణ సమావేశంలో పలు ఎజెండా అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ బీజేపీ కౌన్సిలర్లు మంగళవారం స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ ఎన్.వై. గిరికి డీసెంట్ నోట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ...గురువారం నిర్వహించనున్న సాధారణ సమావేశం ఎజెండాలోని పలు అంశాలలో తీవ్ర లోటుపాట్లు ఉన్నాయని ఆరోపించారు. మున్సిపాలిటీలో రెగ్యులర్‌గా చెల్లించే జీతభత్యాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకే నిధుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఇటువంటి పరిస్థితిలో ఎజెండాలోని పలు ప్రతిపాదిత అంశాలపై తమకు అనేక సందేహాలు ఉన్నాయని, అందుకే వాటిపై అభ్యంతరం తెలుపుతూ ’డిసెంట్ నోట్’ అందజేశామని వివరించారు. ఎజెండా ప్రతులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు శ్రీకాంత్, నరేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, నాయకులు తదితరులున్నారు.


