కామారెడ్డి టౌన్ : సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తుగా సమగ్ర చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) జె. వెంకట్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆయన శనివారం ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల పర్యవేక్షణ, వ్యాధుల నివారణపై వైద్యాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా నిరంతరం ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు. జ్వరం, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల లక్షణాలు ఉన్నవారిని ప్రారంభదశలోనే గుర్తించి తక్షణమే వైద్యం అందించాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు స్థానిక మత పెద్దలు, కుల పెద్దలు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి బాలికకు తప్పనిసరిగా వ్యాక్సిన్ అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఇంటింటి సర్వేతో
జ్వర పీడితుల గుర్తింపు
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
వందశాతం పూర్తిచేయాలి
డీఎంహెచ్‌వో జె. వెంకట్


