కీచక టీచర్లపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

కీచక టీచర్లపై చర్యలు

Jul 19 2026 1:02 AM | Updated on Jul 19 2026 1:02 AM

బాన్సువాడ రూరల్‌: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంత మంది టీచర్లు తమ దుష్ప్రవర్తనతో వృత్తికి కళంకం తెస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు అతిథి అధ్యాపకులను విధులనుంచి తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓ విద్యాలయంలో ఇద్దరు అధ్యాపకులు తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఇంటర్‌ విద్యార్థులు 1098 నంబర్‌కు కాల్‌చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు సంయుక్త విచారణ చేపట్టారు. విచారణ నివేదిక ఆధారంగా డీఈవో మల్లికార్జున్‌ ఇద్దరు అధ్యాపకులను విధుల నుంచి తొలగించారు. ఆ ఇద్దరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ విద్యాలయం ప్రిన్సిపల్‌ శనివారం బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బాన్సువాడ సీఐ తుల శ్రీధర్‌ తెలిపారు. కాగా వేసవి సెలవులకు ముందే సదరు అధ్యాపకుల ప్రవర్తనపై ఫిర్యాదులు వచ్చినా, తిరిగి వారిని ఈఏడాది ఎందుకు కొనసాగించాల్సి వచ్చిందంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్‌ వేటు

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ నిజాంపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అజ్మేరా గోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిజాం తన విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు తోటి లెక్చరర్‌ను వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

డైట్‌ స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి అర్బన్‌ : కన్వీనర్‌ కోటాలో ఖాళీ గా ఉన్న ప్రయివేటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ) సీట్ల భర్తీకి శనివారం స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని నిజామాబాద్‌ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సీట్ల భర్తీ కోసం 21న మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన 22 న తమ ఒరిజనల్‌ ధ్రువపత్రాలతో కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. స్పాట్‌ అడ్మిషన్లలో సీటు పొందిన వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కారని ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు.

పాఠశాల తనిఖీ

ఎల్లారెడ్డి: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను డీఈవో మల్లికార్జున్‌ శనివారం తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న తల్లిదండ్రుల సమావేశాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు స క్రమంగా పాఠాలను బోధించాలన్నారు.

రేపటి నుంచి దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌

ఆన్‌లైన్‌ ప్రక్రియ

కామారెడ్డి అర్బన్‌/ఎల్లారెడ్డిరూరల్‌: డిగ్రీ ప్రవేశాలకు దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 20 నుంచి 26 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ శనివారం వేరువేరు ప్రకటనల్లో తెలిపారు. మొదటి మూడు విడతలో సీట్లు రాని వారి కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ జారీ చేశారని పేర్కొన్నారు. ఈనెల 30న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement