జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి..
● జిల్లాలో 11,973 ఇళ్లు మంజూరు
● ఇప్పటి వరకు 650 నిర్మాణాలు పూర్తి
● రూ. 175 కోట్ల బిల్లుల చెల్లింపులు
నిజాంసాగర్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఇప్పటికే 650 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 175 కోట్లు జమయ్యాయి.
ప్రభుత్వం గతేడాది జనవరి 26న అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సొంత స్థలం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్లను మంజూరు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్ని మండలాల్లో ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులో ఉండడంతో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో ఇసుక కొరతతో మందకొడిగా సాగుతున్నాయి.
నాలుగు విడతల్లో బిల్లులు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నాలుగు విడతల్లో బిల్లులు జమ అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు బేస్‌మెంట్ లెవల్‌లో మొదటి విడతలో లక్ష రూపాయల బిల్లు చెల్లిస్తున్నారు. రూఫ్ లెవల్‌లో రెండో విడత కింద మరో లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మాణం పూర్తయితే మూడో విడతలో రూ. 2 లక్షలు బిల్లు మంజూరు చేస్తున్నారు. ఇంటి నిర్మాణం పూర్తై, రంగులు వేశాక చివరి విడత కింద లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు.
నెలాఖరులో మరో 200 గృహప్రవేశాలు..
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 11,873 ఇళ్లు మంజూరు కాగా.. 10,498 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇప్పటివరకు 650 ఇళ్ల నిర్మాణాలు పూర్తకావడంతో పాటు గృహ ప్రవేశాలూ చేశారు. ఈ నెలాఖరు వరకు మరో 200 ఇళ్లలో గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మంజూరైన ఇళ్లు బేస్‌మెంట్ లెవల్ రూఫ్ లెవల్ స్లాబ్ లెవల్ నిర్మాణం పూర్తైనవి
11, 973 2,766 1,252 3,576 650


