గర్ల్స్ కాలేజీకి ఉత్తమ అవార్డు
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని కోటగల్లిలోని నిజామాబాద్ బాలికల కళాశాల ఉత్తమ కళాశాల అవార్డు సాధించింది. ప్రభుత్వ బాలికల కళాశాలలో వివిధ అంశాలు, ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అవార్డు వచ్చినట్లు ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ తెలిపారు.
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కో బాలికల కాలేజీని ఎంపిక చేసి, అత్యధిక అడ్మిషన్లు, ఉత్తమ ఫలితాల సాధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఎంసెట్, నీట్ శిక్షణ నిర్వహణ, మొక్కల పెంపకం తదితర అంశాలను పరిశీలించి అవార్డు అందజేసినట్లు చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ బాలికల కాలేజీకి హైబీజ్ టెన్‌ఎక్స్‌టీవీ ఎక్స్‌లెన్స్ అవార్డును మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం, హైబీజ్ టెన్ ఎక్స్‌టీవీ ఉమ్మడిగా నిర్వహించిన కార్యక్రమంలో మంగళవారం మాజీ జేడీ లక్ష్మీనారాయణ, విద్యాపీఠం యాజమాన్య ప్రతినిధి ప్రీతిరెడ్డి నుంచి ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిరంతర కృషి, పట్టుదల, నిబద్ధత, విధి నిర్వహణ, కళాశాల అధ్యాపక సిబ్బంది సమష్టి కృషితోనే అవార్డు వచ్చిందన్నారు.


