కామారెడ్డిలో దొంగల అలజడి
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో మంగళవారం వేకువజామున దొంగల అలజడి కలకలం రేపింది. పట్టణంలోని జయశంకర్ కాలనీలో దాదాపు 3 గంటల ప్రాంతంలో దొంగలు సంచరిస్తూ చోరీలకు యత్నించారు. కుక్కలు మొరగడంతో కొందరు కాలనీవాసులు ఇళ్ల లో నుంచి బయటకు వచ్చారు. వారు బయటకు రావడాన్ని గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారని కాలనీవాసులు తెలిపారు. ముసుగులు ధ రించిన ముగ్గురు కాలనీల్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇదిలా ఉండగా అదే సమయంలో ఎన్‌జీవోఎస్ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడినట్లు కాలనీవాసులు తెలిపారు. అక్కడ ఎలాంటి విలువైన వస్తువులు చోరీకి గురి కాలేదని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. దొంగల సంచారం పట్టణ వాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. కాలనీల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


