నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.5 లక్షల ఎకరాల్లో.
కౌలాస్ కింద 9 వేల ఎకరాల్లో...
నిజాంసాగర్: జిల్లాలోని జలాశయాలు నిండుకుండలుగా ఉన్నాయి. ప్రాజెక్టులే కాకుండా చెరువులు, కుంటల్లోనూ నీరుండడంతో యాసంగికి రైతులు ఆశావహ దృక్పథంతో సన్నద్ధమవుతున్నారు.
వర్షాకాలంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వరదలతో జలాశయాలన్నీ నిండుకుండలుగా మారాయి. నిజాంసాగర్, కౌలాస్, పోచారం ప్రాజెక్టులు, సింగితం రిజర్వాయర్ ఇప్పటికీ దాదాపు నిండుగా ఉన్నాయి. చెరువులు, కుంటలు కూడా కళకళలాడుతున్నాయి. సాగు నీరు పుష్కలంగా ఉండడంతో ఆయకట్టు కింద పంటల సాగుకు రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకొని వరినాట్లకు ముందుకు వెళ్తున్నారు.
చెరువుల కింద 90 వేల ఎకరాల్లో...
జిల్లాలో 1,515 చెరువులు, కుంటలు ఉండగా 90 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ప్రధాన చెరువులు, కుంటల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఆయా చెరువుల కింద ఇప్పటికే నారుమళ్లు పోసిన రైతులు.. నాట్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని సింగితం రిజర్వాయర్ కింద 460 ఎకరాల్లో పంటల సాగవనున్నాయి. రిజర్వాయర్ కుడి, ఎడమ పంట కాలువలకు నీటి విడుదల చేపట్టడంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లా వరదప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు కింద 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవనున్నాయి. ఆయకట్టు కింద యాసంగి పంటల సాగు, వరినాట్ల కోసం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలీసాగర్ రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటరి 49 వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని ప్రధాన కాలువ ద్వారా అందిస్తున్నారు. వారం రోజుల నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, కోటగిరి, నవీపేట్, బోధన్ ప్రాంతాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి. మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు వరి సాగుకు నారుమళ్లును సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు వరినాట్లు వేయనున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 17.8 టీఎంసీల నీరుంది. 7 విడతల్లో 12 టీఎంసీల నీటిని ఆయకట్టుకు విడుదల చేయనున్నారు.
జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.237 టీఎంసీలతో కళకళలాడుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 9 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు కింద పంటల సాగు కోసం ప్రాజెక్టు నుంచి పంట కాలువలకు నీటి విడుదల చేపడుతున్నారు. రైతులు నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 1.5 లక్షల ఎకరాల్లో.


