కార్యాలయానికి చోటేదీ?
కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. దీంతో చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కాకపోవడంతో అరకొర సౌకర్యాల మధ్య ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయ భవనంలోనో.. అద్దె భవనంలోనో నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల నిధులు మంజూరైనా పనులు పూర్తి కాకపోవడంతో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్, ఎకై ్సజ్, విద్యుత్ శాఖల కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల ఇతర శాఖల భవనాల్లో కొనసాగుతున్నాయి. చాలావరకు అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. పంచాయతీ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు లేకపోవడంతో అద్దె ఇళ్లలోనే నడుస్తున్నాయి.
కొత్తగా ఏర్పడిన పాల్వంచ, డోంగ్లీ, మహ్మద్‌నగర్, బీబీపేట, రామారెడ్డి, పెద్దకొడప్‌గల్ తదితర మండలాల్లో తహసీల్, మండల పరిషత్ కార్యాలయాలను ఇతర శాఖలకు చెందిన భవనాల్లో ఏర్పాటు చేశారు. అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్వంచ, డోంగ్లీ మండలాల్లో తహసీల్ కార్యాలయాలను రైతు వేదికల్లో నిర్వహిస్తుండడంతో వ్యవసాయ శాఖ ఏవోలు, ఏఈవోలకు కార్యాలయాలు లేకుండాపోయాయి. పాల్వంచ మండల కేంద్రంలో మండల పరిషత్ కా ర్యాలయాన్ని గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం కార్యాలయాలన్నింటినీ ప్రభుత్వ భవనాల్లోకి షిఫ్ట్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయా శాఖల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు కార్యాలయాలను ఎక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై తలలు పట్టుకుంటున్నారు. ఆయా కార్యాలయాలకు అనువైన ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.
అద్దె భవనాల్లో ఉండొద్దన్న సర్కారు
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి
వెంటనే మార్చాలని ఆదేశాలు
సొంత భవనాలు లేక ఇబ్బందులు
ఇప్పటికిప్పుడు మార్చడం సవాలే
అంటున్న అధికారులు


