
వర్షం.. నష్టం
● నీట మునిగిన పంటలు
● ఆందోళనలో రైతులు
నాగిరెడ్డిపేట : భారీ వర్షాలు, వరదలతో మండలంలోని మంజీర పరీవాహక ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. సింగూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు దిగువకు విడుదలవడంతోపాటు పోచారం ప్రాజెక్టు అలుగుపై నుంచి దిగువకు పొంగిపొర్లుతున్న వరదనీటితో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా మంజీరనదిలో దట్టంగా పెరిగిన తుమ్మ చెట్ల కారణంగా నీటిప్రవాహ వేగం తగ్గి వరదనీరు మంజీరనది ఒడ్డున ఉన్న పంట పొలాల్లోకి చేరుతోంది. ఫలితంగా మండలంలోని గోలిలింగాల, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపేట, వెంకంపల్లి, మాటూర్ తదితర గ్రామాల శివార్లలో వరిపంటలు మంజీరనీటితో ముంపునకు గురయ్యాయి. వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి మంపునకు గురవుతున్న పంటలను పరిశీలించారు. నాగిరెడ్డిపేట మండలంలో మంజీరనీటి వల్ల సుమారు 150 ఎకరాలు నీటమునిగాయని ఏవో సాయికిరణ్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఆదుకుంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయించేందుకు బాన్సువాడ ఎమ్మెల్యేతోపాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడానన్నారు.
లింగంపేట మండలంలో..
లింగంపేట: భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. వరదలతో పలుచోట్ల పంటలు నీట మునిగాయి. లింగంపేట మండలంలోని పర్మళ్ల, శెట్పల్లిసంగారెడ్డి, మోతె, సురాయిపల్లి, అయిలాపూర్ తదితర గ్రామాలలో రైతులు టమాట, బీర, కాకర, పచ్చిమిర్చి, బెండకాయ, చిక్కుడు, ఆకుకూరలు, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాల వల్ల పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం.. నష్టం

వర్షం.. నష్టం