
అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ
జీపీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలి
● ఇళ్ల మధ్య పొదలతో ఇబ్బందులు
● నిలుస్తోన్న వర్షపు నీరు
● సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం
దోమకొండ: మండలకేంద్రంతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఇళ్ల మధ్య, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగాయి. దీంతో వర్షపు నీరు నిలిచి చుట్టూ పక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండలాల్లో, గ్రామాల్లో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉన్నాయి. స్థలాలను కొనుగొలు చేసిన యజమానులు వాటిలో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా వదిలేయగా, పిచ్చిమొక్కలు పెరిగి విషపురుగులకు ఆవాసాలుగా మారుతున్నాయి. కొత్తగా మండల కేంద్రాలతో పాటు, జిల్లా కేంద్రం ఏర్పడగా చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేసి ఎలాంటి నిర్మాణాలు చేయకుండా ఖాళీగా ఉంచారు. దీంతో చుట్టుపక్కల ఇళ్ల వారు చెత్త చెదారం అక్కడే వేస్తున్నారు.
విష పురుగులు, కీటకాల సంచారం..
జనావాసాల మధ్య ఖాళీ స్థలాలు ఉండటంతో వాటిని ఆనుకుని ఉన్న ఇళ్లలోకి విష పురుగులు, కీటకాలు వస్తున్నాయి. చెట్లు ఏపుగా పెరిగి, వాననీటికి తడిసి చిత్తడిగా మారుతున్నాయి. పాములు, తేళ్లు, విష కీటకాల కాటుకు గురువుతున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నారు. దీనికి తోడు మురికి కాలువను సైతం తీయడం లేదని, మురికి నీరుతో దుర్గంథం వస్తుందని ప్రజలు వాపోతున్నారు. దోమకొండ మండల కేంద్రంలో ప్రధాన రహదారి విస్తరించినా మురికి కాలువలు నిర్మించలేదు. దీంతో వర్షపు నీరు ఇళ్లలోకి రాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొవాలని వారు కోరుతున్నారు.
ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు ఉండగా, వర్షాకాలం మొక్కలు పెరిగి విష పురుగులు వస్తున్నాయని మండల కేంద్రానికి చెందిన పలువురు మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో వెంటనే పంచాయితీ అధికారులకు సూచనలు చేశాం. సీజనల్ వ్యాధులు కూడా ప్రజలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మాకు సమాచారం ఇవ్వాలి.
– ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో, దోమకొండ

అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ

అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ