
ఆదాయ మార్గాలపై దృష్టి
ఇంటి పన్నులు పెంచడం లేదు
బాన్సువాడ: మున్సిపల్ అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. అక్రమ ఇళ్ల నిర్మాణాలను గుర్తించే పనిలో పడ్డారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో 10,122 గృహాలు.. 1,223 కమర్షియల్, వాణిజ్య, వ్యాపార దుకాణాలున్నాయి. కొంతకాలంగా పట్టణంలో గృహ నిర్మాణం పేరిట వాణిజ్య సముదాయాలు నడుపుతూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఉద్దేశంతో అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. గతంలో పట్టణాన్ని మూడు డివిజన్‌లుగా విభజించి ఇంటి పన్నులు విధించారు. ప్రస్తుతం పట్టణంలో ప్రతి ఇంటిని భువన్ సర్వే చేసి ఇంటి విస్తీర్ణాన్ని కొలతలు వేసి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. పాత ఇంటి పన్నుల ఆధారంగానే విస్తీర్ణాన్ని బట్టి ఇంటి పన్నులు విధిస్తున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఆదాయం ఏరియర్స్‌తో కలుపుకొని రూ.4.50 కోట్లు కాగా దాన్ని మరింత పెంచుకునే మార్గాలను మున్సిపల్ అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రతీ ఏటా రివిజన్ నిర్వహించాల్సి ఉంటుంది.
గృహ నిర్మాణం పేరిట వాణిజ్యం..
పట్టణంలోని మెయిన్ రోడ్డు, పాత బాన్సువాడ రోడ్డు, బీసీ హాస్టల్ రోడ్డు, తాడ్కోల్ చౌరస్తా నుంచి తాడ్కోల్ వరకు, పాత అంగడి బజారు, కొత్త అంగడి బజారు, టీచర్స్ కాలనీ, గాంధీ చౌక్ రోడ్డు, జెండా గల్లీ తదితర రోడ్లలో కమర్షియల్ దుకాణాలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని అందులో వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో మున్సిపల్‌కు గృహ నిర్మాణ పన్నులు మాత్రమే చెల్లిస్తున్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌కు గృహ నిర్మాణ అనుమతి తీసుకుని మరో రెండు అంతస్తులు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. పన్నులు మాత్రం చెల్లించడం లేదు. దీంతో ఆదాయానికి గండిపడుతోంది.
పై అధికారుల ఆదేశాల మేరకే రివిజన్ నిర్వహిస్తున్నాం. పాత ఇంటి పన్నులకు కొత్తగా పన్నులు పెంచడం లేదు. అక్రమ నిర్మాణాలు, అనుమతులు తీసుకోని వాణిజ్య వ్యాపారం చేసుకుంటున్న వారికి పెనాల్టీ వేస్తున్నాం. పన్నులు అధికంగా వేశారని అనుకుంటే దరఖాస్తు చేసుకుంటే మళ్లీ రివ్యూ చేస్తాం.
– శ్రీహరి రాజు, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ
అనుమతులు గృహాలకు..
నడుస్తున్నది కమర్షియల్
గ్రౌండ్ ఫ్లోర్‌కే పన్ను చెల్లింపులు..
పైఅంతస్తులకు ఎగవేత
అక్రమ నిర్మాణాలకే పెనాల్టీ
అంటున్న అధికారులు