
గ్రంథాలయాల సేవలను మెరుగుపర్చేందుకు కృషి
● జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
అంతిరెడ్డి రాజిరెడ్డి
బోధన్: జిల్లాలో గ్రంథాలయ శాఖలను పటిష్టం చేసి పాఠకులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే గ్రంథాలయ శాఖలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన సాలూర మండల కేంద్రంలో నూతనంగా గ్రంథాలయ శాఖ ఏర్పాటు కోసం కొత్త భవన నిర్మాణానికి గ్రామస్తులు ఎంపిక చేసిన స్థలాన్ని ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్దన్, గ్రామపెద్దలతో కలిసి పరిశీలించారు. కొత్త భవనం నిర్మాణం అయ్యే వరకు సహకార సంఘం కోసం ఇటీవల కొత్తగా నిర్మించిన రెండు గదుల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆయనను గ్రామపెద్దలు సన్మానించారు. విశ్రాంత హెచ్‌ఎం ఇల్తెపు శంకర్, ఎత్తిపోతల పథకం కమిటీ చైర్మన్ శివకాంత్ పటేల్, సొసైటీ సీఈవో బస్వంత్‌రావు పటేల్, గ్రామ పెద్దలు కేజీ గంగారాం, లక్ష్మణ్ గౌడ్, కన్నె రమేశ్, సొక్కం రవి తదితరులు పాల్గొన్నారు.