
కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి..
ష్యూరిటీకి వెనకడుగు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు కార్పొరేట్, ప్రైవేటు బ్యాంకులు రుణాలు ఇచ్చే విషయంలో రుణగ్రహీతకు సంబంధించిన ఏదేని ఆస్తిని తనఖా పెట్టుకుంటాయి. తీసుకున్న రుణం చెల్లించలేని పక్షంలో వారిపై పలు రకాలుగా ఒత్తిడి తీసుకువస్తారు. ఇక చెల్లించకుండా మొండికి వేసినపుడు తనఖా పెట్టుకున్న ఆస్తులను చట్ట ప్రకారం సీజ్ చేసి, వేలం నోటీసులు జారీ చేస్తాయి. అయినా చెల్లించకుంటే వేలం వేసి తమకు రావలసిన బాకీని తీసుకుంటాయి. అయితే ఫైనాన్స్, చిట్స్ వ్యాపారాలు నిర్వహించే సంస్థలు.. అప్పు ఇవ్వడానికి గానీ, చిట్టీ డబ్బు చెల్లించడానికి గానీ ష్యూరిటీలు అడుగుతాయి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలన్న నిబంధన పెడతాయి. తమ అవసరం కోసం తెలిసిన వాళ్లు, బంధువులు, స్నేహితులను బతిమాలుకుని ష్యూరిటీగా సంతకాలు పెట్టిస్తాయి. అంతవరకు బాగానే ఉంటుంది.
అయితే అప్పు తీసుకున్న వ్యక్తి గానీ, చిట్టీ డబ్బులు తీసుకున్న వ్యక్తి గానీ వాయిదాలు చెల్లించని పక్షంలో ఒకటి రెండు పర్యాయాలు అడిగి, తరువాత రుణగ్రహీతను వదిలేసి ష్యూరిటీ సంతకం చేసిన వారికి నోటీసులు పంపిస్తున్నాయి. అప్పు తీసుకున్న వ్యక్తి అందుబాటులో లేని పక్షంలో, ఆ వ్యక్తి తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నపుడు ష్యూరిటీ వద్దకు వెళ్లాల్సిన ఫైనాన్స్, చిట్స్ నిర్వాహకులు, సంస్థలు.. ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్తుండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు.
ష్యూరిటీ పెట్టిన పాపానికి కొందరు ఇబ్బందులు పడుతుండడంతో.. వారి అనుభవాలను చూస్తున్న ఇతరులెవరూ తమకు దగ్గరి వ్యక్తులకు సైతం ష్యూరిటీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదని తెలిసింది. తన శక్తి మేరకు ఎంతోకొంత సాయం అందిస్తా గానీ, ష్యూరిటీ మాత్రం ఉండనంటూ కొందరు చేతులెత్తేస్తున్నారు. చాలా చిట్‌ఫండ్ సంస్థల్లో అవసరానికి చిట్టీ తీసుకున్న వ్యక్తులకు ష్యూరిటీలు దొరకని పరిస్థితి తలెత్తుతోంది. కొందరు నెలల తరబడిగా ష్యూరిటీల కోసం తెలిసిన వారినల్లా అడుగుతున్నారు. ష్యూరిటీ పెడితే వచ్చే ఇబ్బందులను చెబుతూ కొందరు.. తాము ఇప్పటికే వేరే వాళ్లకు జమానత్ ఉన్నామంటూ మరికొందరు తప్పించుకుంటున్నారు. దీంతో చిట్టీలు ఎత్తుకున్నవారికి ష్యూరిటీ ఇచ్చేవారు కరువవుతున్నారు.
చిట్‌ఫండ్, ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకున్నవారు, చిట్టీ డబ్బులు తీసుకున్నవారు ద ర్జాగా ఉంటే ష్యూరిటీదారులు మాత్రం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. డబ్బులు కట్టేంతవరకు ఫైనాన్స్ సంస్థలు, చిట్‌ఫండ్‌ల నుంచి నోటీసుల మీద నోటీసులు వ స్తూనే ఉంటున్నాయి. దీంతో ష్యూరిటీ ఇచ్చినవారు అప్పు తీసుకున్న వారి వద్దకు వెళ్లి బతి మాలుకోవాల్సి వస్తోంది. తమకు వచ్చే జీతం తమ అవసరాలకు కూడా సరిపోవడం లేదని, ష్యూరిటీ ఉన్నందుకు ఎక్కడి నుంచి తేవాలంటూ కొందరు కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. ఉద్యోగానికి సెలవు పెట్టి కోర్టులకు తిరగాల్సి వస్తోందని పూచీ పడిన ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పు తీసుకున్నోళ్లను వదిలేస్తున్న ఫైనాన్స్ సంస్థలు
జమానత్‌దారులకు వేధింపులు
డబ్బులు చెల్లించాల్సిందేనంటూ
నోటీసులు
లబోదిబోమంటున్న ష్యూరిటీ ఇచ్చినవారు
దగ్గరి వాళ్లకూ పూచీ ఇవ్వడానికి
వెనకడుగు వేసే పరిస్థితి