
ఆటోమెటిక్ రెయిన్ గేజ్‌ను కప్పేస్తున్న టేకు చెట్లు
కామారెడ్డి అర్బన్: భారత వాతావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డి పాత తహసీల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ రెయిన్ గేజ్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో వర్షపాతం కొలవడానికి పాత పద్ధతులుండగా ప్రస్తుతం మనుషుల అవసరం లేకుండా ఉపగ్రహం ద్వారా ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. కానీ రెయిన్ గేజ్ కేంద్రంపై ఎలాంటి చెట్లు అడ్డుగా ఉండకూడదు. చెట్ల ఆకులు అడ్డుగా ఉంటే సరైన వర్షపాతం నమోదు కాదు. ఆకులపై నీళ్లు నిలిచి ఒకేసారి పడితే వర్షపాతం ఎక్కువ నమోదయ్యే అవ కాశం ఉంటుంది. రెయిన్ గేజ్ కేంద్రానికి గొడు గుగా ఓ వైపున పెద్ద పెద్ద టేకు చెట్లు ఉన్నాయి. కేంద్రంలో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోయింది. వీటి వల్ల వర్షపాతం తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. జలవనరుల నిర్వహణ, వ్యవసాయం, వాతావరణ అ ధ్యయనాలకు ఉపయోగపడే నిరంతర డేటాను తప్పుగా చూపితే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాగా ఆటోమెటిక్ రెయిన్ గేజ్ కేంద్రం నిర్వహణతో తమకు సంబంధం లేదని, చెట్లు ఉన్నా ఏమీ కాదని మండల గణాంకాధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.