మాట నిలుపుకున్న సీఎం రేవంత్
కామారెడ్డి రూరల్: కాంగ్రెస్ మాట తప్పదని, మడమ తిప్పదని, తమది పేదల పక్షపాతి అని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. 2023 మార్చి 18 తేదీన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అకాల వర్షాల కారణంగా కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులైన భిక్కనూరి లక్ష్మి, చిట్యాల రాజమణి, భిక్కనూరి రేఖ శ్రీకాంత్‌కు తాము అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారన్నారు. షబ్బీర్ గురువారం మార్క్ అవుట్, భూమిపూజ చేసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఫామ్‌హౌస్‌లో పడుకొని ఇది చేయలేదు, అది చేయలేదంటున్నారన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత తాను స్వయంగా లేదా వర్చువల్ ద్వారా గృహప్రవేశానికి హాజరవుతానని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిపారు. నియోజక వర్గంలో ఇప్పటివరకు 3028 ఇళ్లు నిరుపేదలకు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, కై లాస్ శ్రీనివాస్‌రావు, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీవో హెప్సిబా రాణి, అన్మాల గంగయ్య, రామాగౌడ్, ఆనంద్‌రావు, కొల్మిభీంరెడ్డి, నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు..
మడమ తిప్పదు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
చిన్నమల్లారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణానికి భూమిపూజ


