మున్సి‘పోల్స్’కు ముందడుగు!
● బల్దియా ఓటర్ల జాబితా
సవరణ షెడ్యూల్ విడుదల
● కసరత్తు చేస్తున్న బల్దియా అధికారులు
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు పడుతున్నాయి. తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాబితా ఆధారంగానే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలోని మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసి ఏడాది కావస్తోంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి తాజాగా షెడ్యూల్ జారీ అయ్యింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల డాటాను మున్సిపల్ వార్డుల వారీగా విభజించి, కొత్త జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఓటరు జాబితా సవరణకు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుండ మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జనవరి 10న తుది జాబితా
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్లు షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. బుధవారం వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటిస్తారు. జనవరి ఒకటో తేదీన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వార్డుల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను నోటీస్‌బోర్డులపై అంటిస్తారు. ఐదు రోజుల పాటు పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 5న మున్సిపల్ కమిషనర్లు, యూఎల్‌బీ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారి, అధికారులతో సమావేశం ఉంటుంది. జనవరి 10న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ బాధ్యతలను సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా జాబితాను రూపొందించాలని కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్లు తమ పేర్లను ముసాయిదా జాబితాలో సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.


