కేసీఆర్, రేవంత్‌ను ఓడించిన కమలయోధుడు.. | Sakshi
Sakshi News home page

కేసీఆర్, రేవంత్‌ను ఓడించిన కమలయోధుడు..

Published Mon, Dec 4 2023 1:08 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో ఐదేళ్లుగా చేస్తున్న అలుపెరగని పోరాటం ఆయనను నాయకుడిగా నిలబెట్టింది. ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. అదే విశ్వాసం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించింది. అది కూడా ఇద్దరు ఉద్ధండులను ఓడించి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేంతగా.. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్‌).. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలను ఓడించి జాయింట్‌ కిల్లర్‌ అన్న పేరు సాధించారు. అయితే ఆయనకు ఈ విజయం అంత సులువుగా దక్కలేదు.

దీని వెనుక కఠోర శ్రమ ఉంది. ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి.వెంకటరమణారెడ్డి 2018లో జిల్లా కేంద్రంలో నవయువ భేరి పేరుతో ఓపెన్‌ డిబెట్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, యువతకు రాజకీయాలపై అవగాహన కల్పించారు. రాజకీయ పార్టీలు, నాయకుల మీద యువతలో ఉన్న అపోహలకు సమాధానాలు ఇచ్చారు. ఆ కార్యక్రమం అప్పట్లో సంచలనం కలిగించింది.

మహిళా సంఘాల వడ్డీ బకాయిల కోసం...
స్వయం సహాయక సంఘాల మహిళలకు రావలసిన పావలా వడ్డీ బకాయిల కోసం 2018 లో వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఉద్యమం లేవదీశారు. కామారెడ్డి పట్టణంలో ర్యాలీ తీశారు. బకాయిల కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగడంతో ప్రభుత్వం ఆయనను అరెస్ట్‌ చేసింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు రావలసిన బకాయిలను విడుదల చేసింది. ధాన్యం, మక్కల కొనుగోళ్ల విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై ఆయన రైతులతో కలిసి అనేక ఉద్యమాలు చేశారు. ధరణి పోర్టల్‌ ద్వారా తలెత్తిన సమస్యలపైనా పోరుసలిపారు.

బల్దియాలో అక్రమాలు, మాస్టర్‌ ప్లాన్‌పై..
కామారెడ్డి బల్దియాలో అక్రమాలపై ఆయన ఈడీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఫిర్యాదులు చేయడంతో విచారణ జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో భూకబ్జాలు, అక్రమాలు, అవినీతిపై మున్సి పాలిటీ ముందు ప్రజా దర్బార్‌ నిర్వహించారు. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌తో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఆయ న చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. 45 రోజుల పాటు ఆందోళనలు కొనసాగా యి. ఈ పోరాటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చి మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఆలయాలు, కుల సంఘాలకు..
నియోజకవర్గంలోని ఆయా గ్రామా ల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధితో పాటు కుల సంఘాలు, ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణానికి వెంకటరమణారెడ్డి సాయం చేశారు. ఆయా అభివృద్ధి పనులకు ఆయన సొంత డబ్బు దాదాపు రూ.60 కోట్లు వెచ్చించారు. ఒకవైపు ప్రజల సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ జూట్‌ బ్యాగులు పంపిణీ చేశారు. ఏటా శివరాత్రి మహాజాగరణ కార్యక్రమం నిర్వహించారు. ఇలా పోరా టాలు, ఉద్యమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయన నిత్యం జనం నోళ్లలో నానుతూ వచ్చారు. అదే ఆయన విజయానికి బాటలు వేసిందని చెబుతున్నారు.

సొంత మేనిఫెస్టోతో ముందుకు..
రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు చేయని మరోసాహసం వెంకటరమణారెడ్డి చేశారు. ఉచిత విద్య, వైద్యం అందించాలన్న తపనతో రూ.150 కోట్లతో సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్‌ బడి, కార్పొరేట్‌ ఆస్పత్రి నిర్మాణం, కామారెడ్డి జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, కార్పొరేట్‌ స్కూల్‌, కాలేజీ నిర్మాణం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే యువతకు ఉపాధి శిక్షణ కేంద్రం, రైతులకోసం రైతు సేవా కేంద్రాలు, ఊరూరా సీసీ కల్లాల నిర్మాణం ఆయన మేని ఫె స్టోలో ముఖ్యమైనవి. తాను ఎమ్మెల్యేగా గెలిచినా, ఓడినా ఈ మేనిఫెస్టో అమలు చేస్తా నని ప్రకటించారు. మేనిఫెస్టోకు సంబంధించిన బుక్‌లెట్‌ను ప్రతి ఇంటికి చేర్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement