మద్నూర్/పెద్దకొడప్‌గల్/ఎల్లారెడ్డిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం రాత్రి, బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల రాళ్లు పడ్డాయి. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. పెద్దకొడప్‌గల్ మండలంలో వందల ఎకరాలలో జొన్న పంట నేలకొరిగింది. ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో ఈదురుగాలులతో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. మద్నూర్ మండలంలోని మేనూర్, సుల్తాన్‌పేట్, మారెపల్లి, మద్నూర్ తదితర గ్రామాల్లో మామిడి తోటలు, జొన్న పంటకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులోగల శ్రీకన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో భగవద్గీత ఆధారిత వి ద్యా విలువలు అంశంపై ఈనెల 24న పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇస్కాన్ కామారెడ్డి ప్రతినిధి వెంకటదాస్ ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగం, సనాతన ధర్మంలో ఇస్కాన్ పాత్ర అంశాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తిగలవారు పాల్గొనా లని సూచించారు.
కామారెడ్డి టౌన్ : జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం ద్వితీయ భాష పరీక్ష నిర్వహించగా.. 99.75 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 13,144 మంది విద్యార్థులకుగాను 13,111 మంది హాజరయ్యారు. 33 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈవో రాజు పర్యవేక్షించారు.


