● వంట గ్యాస్ సరఫరాలో
ఇబ్బందులు లేకుండా చూడండి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, తేమ మీటర్లు, గన్నీ సంచులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గోదాముల నిల్వ సామర్థ్యం సరిపోకపోతే ప్రైవేటు గోదాములు, భవనాలను అద్దెకు తీసుకోవాలన్నారు. అనంతరం ఎల్పీజీ సరఫరాపై సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ రీఫిల్లింగ్, సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 11 నుంచి 17 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న 113 మందిపై కేసులు నమోదు చేశామని, 160 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా రుణాల రికవరీ పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో బ్యాంక్ లింకేజీ రుణాల రికవరీని నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బకాయిల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా శాఖలు సమన్వయంతో పని చేసి, లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, డీఆర్‌డీవో సురేందర్, అదనపు డీఆర్‌డీవో విజయలక్ష్మి, సెర్ప్, సీ్త్రనిధి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైతు మహోత్సవానికి తరలిరావాలి
కామారెడ్డి క్రైం: సిద్దిపేట జిల్లా నర్మెటలో ఈనెల 22 న జరిగే రైతు మహోత్సవానికి రైతులు భారీగా తరలి రావాలని కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ప్రత్యేక స్టాళ్లు, బ్యాంకులు, ఎఫ్‌పీవోలు, స్టార్టప్ కంపెనీల ప్రదర్శనలు, అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సాయంత్రం 4 గంటలకు నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
సౌకర్యాలను మెరుగుపరచాలి
భిక్కనూరు: ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు సౌకర్యాలను మెరుగు పరుచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం ఆయన జంగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట డీఈవో రాజు, తహసీల్దార్ సునీత తదితరులు పాల్గొన్నారు.


