సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఓ యువకుడు బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. కామారెడ్డి మండలం ఇస్రోడిజివాడికి చెందిన కనుకంటి సాయికుమార్(23) కొన్ని రోజులుగా మండల కేంద్రంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో కుకింగ్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లో మద్యం సేవించి మత్తులో ఉరేసుకున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యకు దారితీసినట్లు ఎస్సై వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మొగులయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ ప్రశాంత్‌ను చిన్నదడ్గి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చంపేస్తానని బెదిరించడంతో బుధవారం పొలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి దడ్గి లైన్‌లో మరమ్మతులు ఉన్నాయని లైన్‌మన్ ఎల్‌సీ తీసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆపరేటర్ ప్రశాంత్‌కు ఫోన్ చేసి కరెంటు సరఫరా ఎందుకు తీశారని, వెంటనే ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్‌మన్ ఎల్‌సీ తీసుకున్నాడని చెప్పినా వినకుండా తనకే ఎదురు చెబుతావా? నీ సంగతి చూస్తా..అంటూ అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో పై అధికారుల ఆదేశాల మేరకు ఆపరేటర్ పొలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి కేసునమోదు చేస్తామని ఎస్సై రాజు తెలిపారు.
కారు దగ్ధం
● త్రుటిలో తప్పిన ప్రమాదం
మాచారెడ్డి: మండలంలోని గన్‌పూర్(ఎం) గ్రామ శివారులో కామారెడ్డి–సిరిసిల్లా రహదారిపై ఓ కారు దగ్ధమైంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన శ్రీనివాస్ గౌడ్ కారులో కామారెడ్డికి వెళుతున్నారు. గన్‌పూర్(ఎం) శివారులోకి రాగానే సీఎన్‌జీ కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో అనుమానం వచ్చి రోడ్డు పక్కన కారును నిలిపివేశాడు. అంతలోనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. శ్రీనివాస్‌గౌడ్ అప్రమత్తమై కారును నిలిపివేయకుంటే పెను ప్రమాదం సంభవించేదని ఎస్సై అనిల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.


