కాకినాడ లీగల్: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో స్టాంపుల విక్రయాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టాంప్ వెండర్ల నిబంధనల ప్రకారం సెలవు రోజుల్లో నాన్ జ్యుడీషియల్ స్టాంపులు విక్రయించరాదని చెబుతున్నప్పటికీ, ఆదివారం ఒక స్టాంప్ వెండర్ రూ.20 విలువైన నాన్ జ్యుడీషియల్ స్టాంపులను విక్రయించారు. ఈ స్టాంపులపై ముద్రించిన తేదీకి, స్టాంప్ వెండర్ విక్రయాల రిజిస్టర్లో నమోదు చేసిన తేదీకి మధ్య వ్యత్యాసం ఉండటం అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమైంది. ఈ నెల 14వ తేదీన సర్వర్ సమస్య తలెత్తడంతో స్టాంపుల విక్రయాలు జరగలేదు. దీంతో కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు అఫిడవిట్ల కోసం అవసరమైన నాన్ జ్యుడీషియల్ స్టాంపులను కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఒక స్టాంప్ వెండర్ స్టాంపుల విక్రయాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం కొనుగోలు చేసిన స్టాంప్ పేపర్లపై నవంబర్ 15వ తేదీ ముద్రించి ఉండగా, స్టాంప్ వెండర్ విక్రయాల పుస్తకంలో మాత్రం నవంబర్ 14వ తేదీగా నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్టాంపులపై పలువురు అభ్యర్థులు తమ అఫిడవిట్లను సిద్ధం చేసి నామినేషన్లకు వినియోగించినట్లు సమాచారం.
న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయా?
స్టాంప్ పేపర్‌పై ఉన్న తేదీకి, విక్రయాల రిజిస్టర్లో నమోదైన తేదీకి వ్యత్యాసం ఉండటంతో తమ అఫిడవిట్ల విషయంలో భవిష్యత్తులో ఏవైనా అభ్యంతరాలు ఎదురవుతాయా? నామినేషన్ల పరిశీలన సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్టాంపుల విక్రయాలు జరిగితే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.
అఫిడవిట్ల చెల్లుబాటుపై
అభ్యర్థుల్లో గందరగోళం


