కాకినాడ లీగల్: కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల నాయకులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌కు ఒకరోజు ముందు ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), ఇతర పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేసే కేంద్రం, పోలింగ్ అనంతరం ఎన్నికల సామగ్రిని తిరిగి స్వీకరించే కేంద్రాలపై వివరించారు.
పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య రంగరాయ మెడికల్ కాలేజీకి తరలించి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తామని వివరించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం రంగరాయ మెడికల్ కాలేజీలో ప్రత్యేకంగా రెండు గదులను కేటాయించి మొత్తం 66 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించి అభ్యర్థులు ముందుగానే తమ ఏజెంట్ల పేర్లను సమర్పించాలని, వారికి సంబంధించిన గుర్తింపు, సంతకాల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో నగదు, ఇతర విలువైన వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా ఉంటుందని, రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లే సందర్భంలో సంబంధిత ఆధారాలు కలిగి ఉండాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, డీఎస్పీ దుర్గారావు, అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసులు, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు, ట్రాఫిక్ వన్ సీఐ రమేష్ పాల్గొన్నారు.


