భూలోక వైకుంఠాన్ని తలపించేలా.. | - | Sakshi
Sakshi News home page

భూలోక వైకుంఠాన్ని తలపించేలా..

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

● నేత్రపర్వంగా సత్యదేవుని తెప్పోత్సవం

● పంపా నదిలో హంస వాహనంపై విహారం

అన్నవరం : నిండు పున్నమి వెలుగులో సత్యదేవుని జల విహారం భూలోక వైకుంఠాన్ని తలపించింది. రత్నగిరి శిఖరాలను దాటి అనంతలక్ష్మి సమేత సత్యదేవుడు తరలివచ్చే వేళ పంపా నది పులకించింది.. విద్యుత్‌ దీపాల కాంతులు, పూల సువాసనలలో హంస వాహనంపై స్వామి అమ్మవార్ల జలవిహారం నేత్రపర్వంగా సాగింది. ఈ వేడుకలను వీక్షించిన ప్రతి మది తన్మయత్వంతో నిండిపోయింది. ఈ మధుర ఘట్టానికి అన్నవరం వేదికై ంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని తెప్పోత్సవం శనివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై రత్నగిరి వాసుడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను వేదపండితుల మంత్రోచ్ఛారణ, మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల మధ్య నదిలో మూడు సార్లు విహరించారు. తొలుత సాయంత్రం 5.30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను మేళతాళాలతో ఊరేగింపుగా రత్నగిరి నుంచి పంపా నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సింహాసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను, వారి పక్కనే మరో ఆశనంపై క్షేత్ర పాలకులు సీతారాములను ఉంచి తులసీ ధాత్రి పూజ నిర్వహించారు. తర్వాత పంపా నది ఒడ్డున హంసవాహనంపై ప్రత్యేక మండపంలో స్వామిఅమ్మవార్లను ప్రతిష్ఠించారు. ఇలా తెప్పోత్సవం ప్రారంభించారు. ఈ ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు పర్యవేక్షించారు. వేదపండితులు గంగాధరబట్ల గంగబాబు, గొల్లపల్లి ఘనపాఠీ, యనమండ్ర శర్మ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు తదితరులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి తొమ్మిది గంటలకు మంగళవాయిద్యాల నడుమ స్వామి, అమ్మవారిని ఊరేగింపుగా తిరిగి రత్నగిరికి తీసుకొచ్చారు. తర్వాత ఘాట్‌రోడ్‌ టోల్‌గేట్‌ వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కాగా, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పెద్దాపురం డీఎస్‌పీ తిలక్‌ ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, మరో 300 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement