● కాకినాడలో వైఎస్సార్ సీపీ
విజయం ఖాయం
● మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులతో
మాజీ మంత్రి కన్నబాబు ప్రచారం
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీకి ప్రజలే బలం.. బలగమని, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని మాజీ మంత్రి, పార్టీ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కురుసాల కన్నబాబు అన్నారు. స్థానిక 63, 64 డివిజన్లలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేయర్ అభ్యర్థిని కాదా సత్యశ్రీతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నగరంలో సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన కాదా వెంకటరమణ సతీమణి కాదా సత్యశ్రీ, 63, 64 డివిజన్ల అభ్యర్థులు గెడ్డాడ సత్యశ్రీ, దంతులూరి వీరభద్రరాజులను గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా కాకినాడకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తింపు వచ్చిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి అధికారం ఇవ్వడం ద్వారా మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థితో పాటు కార్పొరేటర్ అభ్యర్థులపై కూటమి నేతల వేధింపులు ప్రారంభమయ్యాయని, వాటిని మానుకోవాలన్నారు. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసే హక్కు ప్రజలకు ఉండాలని, అలా కాకుండా బెదిరించి, ఎన్నికల్లో గెలుస్తామనుకుంటే పొరబాటు అని అన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మొదటి విడత మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపులు, అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. వాటిని మానుకోవాలని అధికార పార్టీకి హితవు పలికారు. ప్రజలు ఆగ్రహానికి లోను కావొద్దని కన్నబాబు సూచించారు. ప్రచారంలో వైఎస్సార్ సీపీ నేతలు జమ్మలమడక నాగమణి, మాజీ కార్పొరేటర్ ఐ.శ్రీను, కడియాల చిన్నా, మాజీ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, కొప్పిశెట్టి గణేష్, గెడ్దాడ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


