ప్రత్తిపాడు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఓపీ నమోదు, వైద్య పరీక్షలు, వైద్యం అందిస్తున్న విధానం, వైద్యుల అందుబాటు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పంచాయతీ ఎన్నికల మూడో దశ ప్రక్రియలో భాగంగా నామినేసన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్ బాబు, తహసీల్దార్ ఎం సూర్యప్రభ, కార్యదర్శి జ్యోతుల పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.
నూతన ఆలోచనలకు
వేదికగా సైన్స్ కాంగ్రెస్
అమలాపురం రూరల్: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనా తత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా 32వ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్–2026 జిల్లా స్థాయి ప్రదన్శనను వన్నె చింతలపూడి ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన 106 శాసీ్త్రయ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. బహుమతి ప్రదానోత్సవ సభలో డీఈఓ డాక్టర్ ఎస్‌కే మహబూబ్ బాషా మాట్లాడుతూ విద్యార్థుల స్వీయ ఆలోచనల నుంచి ప్రాజెక్టులు రూపొందించినప్పుడే వారిలో పరిశోధనా దృక్పథం, సమస్యల పరిష్కార సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి.మమ్మీ, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
జిల్లా స్థాయికి ఏడు ప్రాజెక్టుల ఎంపిక
జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ బ్రహ్మానందం ఆధ్వర్యంలో న్యాయనిర్ణేతల బృందం వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 106 ప్రాజెక్టులను పరిశీలించింది. రామచంద్రపురం మండలం సీహెచ్‌ఎస్ నగర్ ఎస్‌ఐసీఎంపీఎల్ హెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థిని కొమలి వైష్ణవి కావ్య (8వ తరగతి), అమలాపురం మండలం వన్నెచింతలపూడి ఉన్నత పాఠశాల విద్యార్థిని మామిడిశెట్టి వెంకట సహస్ర (9వ తరగతి) వాటర్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్‌లు, పి.గన్నవరం మండలం కె.ముంజవరం హైస్కూల్ విద్యార్థి మట్టపర్తి హేమశ్రీ వైష్ణవి (8వ తరగతి) వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్, రావులపాలెం హైస్కూల్ విద్యార్థిని కల్లకూరి శామిలి ప్రియ (8వ తరగతి) ఎనర్జీ ఎక్స్‌ప్రోజర్ ప్రాజెక్టు, రాజోలు మండలం కూనవరం హైస్కూల్ విద్యార్థి కందాల కుమార్ సత్యనాయుడు (10వ తరగతి) వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్, రామచంద్రపురం మండలం వెల్ల హైస్కూల్ విద్యార్థి గంగుమళ్ల అభిషేక్ పాల్ (9వ తరగతి), తాటిపాక ఉన్నత పాఠశాల విద్యార్థి అనిశెట్టి దినేంద్ర కుమార్ (8వ తరగతి) ఆహార, వ్యవసాయం, వైద్యం ప్రాజెక్ట్‌లను ఎంపిక చేశారు.


