పంపకాల్లో గుంపగా.. | - | Sakshi
Sakshi News home page

పంపకాల్లో గుంపగా..

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

● టీడీపీ నేతలకు దక్కని ప్రాధాన్యం

● జిల్లాలో పదవులన్నీ జనసేనకే

● మంత్రి నుంచి ఎంపీ,

జెడ్పీ చైర్మన్‌ పీఠాల్లో పాగా

● ఈ పరిణామాలపై పచ్చ

నేతల ఆగ్రహావేశాలు

● స్వార్థ రాజకీయాల కోసం క్యాడర్‌ను

బలి చేస్తున్నారంటూ అంతర్మథనం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో టీడీపీ దుకాణం బంద్‌ అవుతోందా..? అత్యంత కీలకమైన పదవులన్నీ జనసేన నేతలకు కట్టబెట్టారా..? టీడీపీ నేత అని చెప్పుకొనేందుకు సైతం సిగ్గుపడే పరిస్థితి తెచ్చారా..? చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు క్యాడర్‌ను బలి చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.

నామినేటెడ్‌, ఇతర పదవుల్లో జనసేన నేతలకు దక్కుతున్న ప్రాతినిథ్యంపై టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా ఏళ్లుగా శ్రమిస్తున్నా.. తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆది నుంచి పార్టీ జెండా మోస్తున్నా గుర్తింపు కరవవుతోందన్న మీమాంస ఏర్పడింది. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పార్టీ క్యాడర్‌ను నిర్వీర్యం చేయడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైకి విమర్శించలేకపోయినా.. అంతర్గతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎంత మిత్రపక్షమైనా ఓ పరిమితి ఉండాలని, జిల్లా మొత్తం రాసిచ్చేస్తారా..? ఆ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలా..? అని మండిపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో టీడీపీ శ్రేణులు ఒక్కరు కూడా పార్టీలో మిగలరని జోస్యం చెబుతున్నారు. భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కూటమిలో పదవుల పంపకాలు చూస్తుంటే.. అసలు టీడీపీ జిల్లాలో ఉందా..? అనే సందేహం కలుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అలకనూ చులకన చేస్తూ...!

మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్‌ నేత పిల్లి అనంతలక్ష్మికి జెడ్పీ చైర్మన్‌ పదవి ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. ఈ ఘటనపై మనస్థాపం చెందిన సీనియర్‌ నేత జెడ్పీటీసీ సభ్యురాలిగా ప్రమాణం చేయకుండానే వెళ్లిపోయారు. తనకు పదవి కూడా వద్దంటూ జెడ్పీ సమావేశం హాల్‌ నుంచి నిష్క్రమించారు. సీనియర్‌ నేతకు అన్యాయం చేసిన చంద్రబాబు పిలిచి మాట్లాడాల్సి ఉన్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా విలేకరుల సమావేశంలో పదవుల కోసం అలగడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేయడంపై పిల్లి వర్గం మండిపడుతోంది. జనసేనకు పదవి కట్టబెట్టిందే కాకుండా... ఒక సీనియర్‌ నేతను అవమానించడంపై ఆ వర్గం కారాలు మిరియాలు నూరుతోంది.

మున్సిపాలిటీల్లో పాగా..

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలు ఉండగా.. తుని, పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట మున్సిపల్‌ చైర్మన్‌లు, కాకినాడ మేయర్‌ అభ్యర్థి సైతం జనసేనకే దక్కడంపై టీడీపీ శ్రేణులకు రుచించడం లేదు.

జిల్లా పరిషత్‌ పీఠం సైతం

నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిషత్‌ పీఠాన్ని సైతం జనసేన కై వసం చేసుకుంది. తొలుత టీడీపీకి కేటాయించాలన్న ప్రతిపాదన నడించింది. తెర వెనుక చక్రం తిప్పిన జనసేనాని తమ కార్యకర్తలకే దక్కించుకోవడంతో టీడీపీ నేతలు భంగపాటుకు గురవ్వాల్సిన దుస్థితి ఎదురైంది. జెడ్పీ పీఠం కోసం కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే తన సోదరుడి కోడలి కోసం చేసిన ప్రయత్నాలు సైతం నిష్ఫలంగా మారడంతో తెల్లముఖం వేసుకుని ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకప్పుడు జిల్లాలో పరిమిత స్థాయిలో మాత్రమే జనసేన క్యాడర్‌ ఉండేది. చంద్రబాబు కూటమి కట్టాక నామినేటెడ్‌, కీలకమైన పదవులన్నీ జనసేనకు వరించడంతో ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నింపుతోంది.

నామినేటెడ్‌ పదవులు కూడా!

కీలకమైన, అత్యంత ప్రాధాన్యమైన రాజకీయ, నామినేటెడ్‌, స్థానిక సంస్థల పదవులన్నీ జనసేనకే కట్టబెట్టడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి పదవి నుంచి ఎంపీ స్థానం వరకు.. ఎమ్మెల్యే స్థానం నుంచి వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు జనసేన నేతలకే వరించాయి. తాజాగా జిల్లా పరిషత్‌ పీఠం సైతం ఆ పార్టీ మహిళా నేతకే దక్కింది. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ అభ్యర్థిత్వం కూడా జనసేనకే కేటాయించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని తలచుకుని అంతర్గతంగా రగిలిపోతున్నారు.

పదవులు ఇలా...

కాకినాడ జిల్లా పేరు చెబితేనే జనసేన జిల్లాగా మారిపోయింది. ప్రధానమైన పదవులన్నీ జనసేన నేతలకే కట్టబెట్టేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాకినాడ ఎంపీ జనసేనకు చెందిన ఉదయ్‌ శ్రీనివాస్‌ కొనసాగుతున్నారు. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే సైతం జనసేనకే దక్కింది. పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ సుధీర్‌, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌ తుమ్మల బాబు, కౌడా చైర్మన్‌గా తలాటం సత్య కొనసాగుతున్నారు. ఈ పదవులన్నీ ప్రాధాన్యమైనవే. ఆర్థికంగా, పరిపాలన పరంగా కీలకమైన పదవులు. అన్నింట్లో జనసేన నేతలే ఉండటంతో టీడీపీ శ్రేణులు తమ పనులపై వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. తమలో మిత్రపక్షమైన నేతల వద్దకు తాము వెళ్లాలా..? అని నిట్టూరుస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement