శంఖవరం: జాతీయ రహదారి 216లో కత్తిపూడి శివారు సీతారామా కళాశాల సమీపాన రోడ్డుపై టిప్పర్ నుంచి శుక్రవారం భారీ బండరాళ్లు పడ్డాయి. ఆ సమయంలో ఏ వాహనం రాకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. రౌతులపూడి మండలం నుంచి శంఖవరం, కత్తిపూడి మీదుగా కాకినాడకు నిత్యం అనేక టిప్పర్లు వేగంగా రాకపోకలు సాగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో వెళుతున్నాయి. ఈ రోడ్డు వెంబడి స్పీడు బ్రేకర్లు ఉన్నప్పటికీ బ్రేక్ వేయకుండానే అతి వేగంతో రాకపోకలు చేస్తున్నారని వాహన చోదకులు వాపోతున్నారు. ఈ సమీపంలోనే పాఠశాల, కళాశాల, ఆసుపత్రులు, దేవాలయాలు, షాపులు ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. కాగా.. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు స్పందించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బండరాళ్లను అక్కడ నుంచి తొలగించారు.


