పూర్తి పరిహారం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

పూర్తి పరిహారం ఇవ్వండి

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

● తుపాను ప్రభావంతో

ముంచెత్తిన ఉప్పు నీరు

● 250 ఎకరాల్లో వరికి తీవ్ర నష్టం

● ఆదుకోవాలని రైతుల ఆందోళన

కొత్తపల్లి: తుపాను ప్రభావంతో వరి పంట దెబ్బ తిందని, తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చి, ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాధిత రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు ఉప్పాడ – కొత్తపల్లి రోడ్డులోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తుపాను ధాటికి ఉప్పాడ శివారు సుబ్బంపేట సమీపాన బీచ్‌ రోడ్డు కోతకు గురై, సమీపంలోని సుమారు 250 ఎకరాల వరి పంటను సముద్రపు ఉప్పునీరు ముంచెత్తిందని అన్నారు. చేతికి అంది వచ్చే దశలో ఉన్న పంట పూర్తిగా దెబ్బ తిని, రూ.లక్షల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు పెట్టుబడులకు అప్పులు చేయడంతో పాటు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు సైతం తాకట్టు పెట్టాల్సి వచ్చిందన్నారు. నెలల తరబడి కష్టపడి పండించిన పంటను కోలుకోలేని విధంగా తుపాను దెబ్బ తీసిందని వాపోయారు. ఇంతలా నష్టపోయినప్పటికీ తమను పరామర్శించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సాధారణ పంట నష్టంగా చూడరాదని, ఉప్పు నీరు పొలాల్లోకి చేరిన విషయాన్ని గుర్తించి, పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, పూర్తి స్థాయి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న రైతులతో తహసీల్దార్‌ చిన్నారావు చర్చించారు. ఎంతమంది రైతులు, ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయారనే వివరాలతో వినతిపత్రం అందించాలని సూచించారు. ఆందోళన చెందవద్దని, విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement