పిఠాపురం: స్థానిక వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పెదపాటి రాజేష్ కుమార్‌ను ఆ పార్టీ ప్రకటించింది. దీంతో స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందిన రాజేష్ కుమార్ బీఎస్సీ, బీఈడీ, ఎంఏల్ పూర్తి చేశారు. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో పిఠాపురం మున్సిపాలిటీలోని 16వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ స్థానిక రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తనను మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్రెడ్డికి, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంగా గీతకు రాజేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
శ్రేణుల్లో ఉత్సాహం
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రాజేష్ కుమార్ ఎంపికతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం, పార్టీ కార్యక్రమాల్లో ఆయనకు ఉన్న పరిచయాలు ఎన్నికల ప్రచారంలో కలిసి వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నామినేషన్ దాఖలుతో ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరలేవనుంది.
గెలుపు దిశగా అడుగులు
పిఠాపురం మున్సిపాలిటీలో విజయం సాధించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ నాయకత్వం అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. సీనియర్ నాయకుడు గండేపల్లి రామారావు (బాబి), పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు ఇతర సీనియర్ నాయకులు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో గెలుపుపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వార్డుల వారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవడం, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఓటర్ల మద్దతు కూడగట్టడం ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
ఫ వైఎస్సార్ సీపీ నుంచి బలమైన అభ్యర్థి
ఫ నేడు నామినేషన్ దాఖలుకు సన్నాహాలు


