పీఠం కోసం పాకులాట | - | Sakshi
Sakshi News home page

పీఠం కోసం పాకులాట

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జెడ్పీ చైర్మన్‌ పీఠం కోసం జనసేన, టీడీపీలు పాకులాడుతున్నాయి. ఈ స్థానం తమకంటే తమకే దక్కుతుందంటూ ఇరు పార్టీలు ఆశల పల్లకిలో ఊగుతున్నాయి. ఈ సర్దుబాట్లపై తాజాగా పవన్‌, చంద్రబాబు జరిపిన చర్చల్లో ఓ క్లారిటీ వచ్చినట్లు ఆయా పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు. కాకినాడ జెడ్పీ చైర్మన్‌ సీటు జనసేనకు ఖరారు చేయడం దాదాపు లాంఛనమేనంటూ ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. నేడో, రేపో అధికారిక ప్రకటన సైతం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిణామం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.

పిఠాపురం నేతకు అవకాశం

జెడ్పీ చైర్మన్‌ స్థానం జనసేనకు కేటాయించినట్లు తెలిసింది. ఈ మేరకు పిఠాపురం జనసేన మహిళా నేత బుర్రా దివ్యరాజ్‌ పేరు దాదాపు ఖాయమైనట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆమె కాకినాడ రూరల్‌, పెద్దాపురం, యు.కొత్తపల్లి జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. జెడ్పీ చైర్మన్‌ స్థానం తమకే దక్కాలంటూ కొందరు జనసేన నేతలు పవన్‌కు దృష్టికి తీసుకెళ్లడం, చంద్రబాబు వద్ద జనసేన పెద్దలు పంచాయితీ పెట్టడంతో సీటు పక్కా అన్న సంకేతాలు అధిష్టానం నుంచి వెలువడినట్లు తెలిసింది. ఈ పరిణామం టీడీపీ నేతల్లో అగ్రహావేశాలు నింపుతోంది. కాకినాడ జిల్లాకు చెందిన కీలక పదవులన్నీ జనసేనకు కేటాయిస్తే తమ పరిస్థితేంటని మండిపడుతున్నారు. బహిరంగంగా విమర్శిస్తే అధిష్టానం నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో అంతర్గతంగా కుమిలిపోతున్నారు. జెడ్పీ చైర్మన్‌ టీడీపీకి కేటాయించాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

మేయర్‌ స్థానం కూడా..

సీట్ల సర్దుబాటులో భాగంగా ఇప్పటికే కాకినాడ మేయర్‌ జనసేనకు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనప్పటికీ.. జనసేనకు కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్న వారిని కాదని జనసేనకు ప్రాధాన్యం ఇవ్వడంపై అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఈ విషయమై టీడీపీ ఎమ్మెల్యేల వద్ద కొందర నేతలు గళం విప్పుతున్నట్లు తెలిసింది. వారు మాత్రం చేసేది లేక పొత్తు ధర్మం, అధిష్టాన నిర్ణయం పాటించాలంటూ ఉచిత సలహా ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో కీలకమైన డీసీసీబీ, కౌడా చైర్మన్లు, రాష్ట్ర స్థాయిలో సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌, నీటిపారుదల వంటి పదవులు కట్టబెట్టారని, అవి చాలదన్నట్లు మేయర్‌, జెడ్పీ చైర్మన్‌ కూడా జనసేనకు వదిలేస్తే.. కాకినాడ జిల్లాలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. జెడ్పీ స్థానం జనసేనకు కేటాయిస్తే.. కాకినాడ మేయర్‌ స్థానమైనా టీడీపీకి ఇవ్వాలంటూ కొందరు పట్టుబడుతున్నట్లు తెలిసింది.

టీడీపీకి భంగపాటు

జెడ్పీ చైర్మన్‌ స్థానాన్ని టీడీపీ ఆశించి భంగపాటుకు గురైంది. ఈ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆశించారు. కాకినాడ రూరల్‌ జెడ్పీటీసీగా నామినేషన్‌ సైతం దాఖలు చేశారు. తొలుత ఆమె పేరును ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా అభిప్రాయ సేకరణ సైతం చేపట్టారు. ఇంకే మంది జెడ్పీ పీఠం టీడీపీకే దక్కుతుందని అందరూ భావించారు. కానీ తాజాగా జరిగిన చర్చల్లో జనసేనకు కేటాయిస్తున్నట్లు వార్తలు రావడంతో టీడీపీ శ్రేణులకు భంగపాటు తప్పడం లేదు.

జెడ్పీ చైర్మన్‌ స్థానానికి

జనసేన, టీడీపీ పట్టు

జనసేనకు ఖరారు చేసినట్లు

ఊహాగానాలు

రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement