● తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం
● ఎమ్మెల్యేలు వనమాడి,
పంతం నానాజీలపై ద్వారంపూడి ఫైర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొచ్చి డ్రగ్స్ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో తనకు సంబంధం ఉందంటూ కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ పదేపదే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. ఆదివారం స్థానికంగా తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అబద్ధాల కొండబాబుకు ఇప్పుడు పంతం నానాజీ తోడయ్యారని దుయ్యబట్టారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రోకళ్ల సత్యనారాయణతో కలిసి తాను ప్రయాణించానంటూ పంతం నానాజీ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రోకళ్ల సత్యనారాయణతో కలిసి తానెప్పుడూ విదేశీ పర్యటనలు చేయలేదన్నారు. కావాలంటే తన పాస్‌పోర్ట్ ఇస్తానని, ఇమిగ్రేషన్ అధికారుల ద్వారానో.. ఇతర మార్గాల ద్వారానో విచారణ చేసుకోవచ్చని సవాల్ చేశారు. పదేపదే తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి కొచ్చి డ్రగ్స్ కేసు విషయమై సీబీఐ విచారణ జరిపించాలని కోరగలరా అని ప్రశ్నించారు. ఆ విచారణలో తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. ఆరోపణల్లో ఏమాత్రం నిజం ఉన్నట్లు తేలినా తాను రాజకీయాలను వదిలేస్తానని ద్వారంపూడి స్పష్టం చేశారు.


