జెండా మోసినోళ్లను పక్కనబెట్టి.. | - | Sakshi
Sakshi News home page

జెండా మోసినోళ్లను పక్కనబెట్టి..

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

● పార్టీలు మారొచ్చిన వారికే పదవులు, సీట్లు

● రసవత్తరంగా పిఠాపురంలో రాజకీయం

పిఠాపురం: గత ఎన్నికల్లో జెండా మోసిన జనసేన నేతలను పక్కకు నెట్టేయడం ఆ పార్టీలో లుకలుకలకు కారణమవుతోంది. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు, సీట్లు ఎలా కేటాయిస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కూటమి అధికారం చేపట్టిన కొద్ది కాలానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన అనుచర వర్గంతో పవన్‌ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. చేరిన కొత్తలో చాపకింద నీరులా వ్యవహరించి, ఎన్నికలు సమీపించే నాటికి ఒక్కసారిగా తెరపైకి వచ్చి కూటమిలో పదవులు, సీట్లు కేటాయింపు చేపట్టే స్థాయికి ఎదిగారు. ఎంతలా అంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అసలైన జనసేన కార్యకర్తలను పక్కన పెట్టి, పిఠాపురం మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక వార్డు స్థానాలను తన అనుచర వర్గానికి కేటాయించుకునేలా ‘చక్రం’ తిప్పే వరకు ఎదిగారు. చివరకు వార్డు స్థానాల రిజర్వేషన్ల ఖరారు సైతం ఆయన చెప్పినట్టే జరిగియన్న ప్రచారం సాగింది. వార్డు స్థానాల కేటాయింపులో సైతం టీడీపీకి తీవ్ర అన్యాయం చేశారంటూ ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో టీడీపీ సీనియర్‌ నాయకులు దేవరపల్లి రామారావు, నల్లా శ్రీను, అల్లవరపు నగేష్‌, రాయుడు శ్రీను వంటి వారు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో కూటమికి పని చేయాలని టీడీపీ పెద్దలు కోరినా నో చెప్పినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలు పిఠాపురం రాజకీయాల్లోనే కాకుండా కూటమి పార్టీలైన జనసేన, టీడీపీల మధ్య, జనసేన పాత, కొత్త నాయకుల మద్య చిచ్చురేపాయి. ఎన్నికలకు ముందు నా గెలుపు వర్మ చేతుల్లో పెట్టానని పవన్‌ కళ్యాణ్‌ అనడంతో వర్మ, టీడీపీ క్యాడర్‌ పవన్‌కళ్యాణ్‌ గెలుపు కోసం అహర్నిశలు కష్టించి పనిచేశారు. విజయం సాధించిన తరువాత జరిగిన రాజకీయ చదరంగంలో వర్మ పావుగా మారడంపై టీడీపీ క్యాడర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇటీవల పిఠాపురంలో జరిగిన సభలో పవన్‌ తన విజయానికి పనిచేసిన దొరబాబు అనడంతో రాజకీయాలు ఈ విధంగా ఉంటాయా అన్న చర్చ మొదలైంది. దీంతో ప్రస్తుతం పిఠాపురం మున్సిపల్‌ ఎన్నికలు మాజీ ఎమ్మెల్యేలు దొరబాబు, వర్మ మధ్య జరుగుతున్నట్టు ఉన్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి కూటమి తరఫున ఎంపిక చేసిన అభ్యర్థి పట్ల టీడీపీ నాయకులు, పాత జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement