● కమలంలో కుమ్ములాటలు
● స్థానిక పోరులో వర్గాలుగా
మహిళా నేతలు
● టికెట్ల కోసం బహిరంగంగా విమర్శలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కమలంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు బీజేపీలో టికెట్ల కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు పట్టుబడుతుండటంతో వర్గపోరు మొదలైంది. సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరక కొందరు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో స్థానిక ఎన్నికల వేళ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జిల్లాలో బీజేపీకి రెండు జెడ్పీటీసీ, ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు కేటాయించేలా అంతర్గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఆయా స్థానాల్లో ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై ఆ పార్టీలో ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. టికెట్లపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఇప్పటికే ఆయా మండలాల్లో నామినేషన్లు దాఖలు చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీట్ల పంపకాలపై పార్టీ నాయకుల మధ్య చర్చలు పూర్తికాక ముందే టికెట్ తమకే ఇవ్వాలంటూ ఆశావహులు పట్టుబడుతున్నారు. వారికి అవకాశం కల్పించకపోతే రాజకీయంగా నష్టపోతామనే ఆందోళనతో కొందరు నాయకులు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు పార్టీ ఐక్యతపై ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది.
పదవికి రాజీనామా చేయలేదంటూ ఫిర్యాదు
ప్రభుత్వ పదవిలో ఉన్న తుమ్మల పద్మ, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయకుండానే జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారని కరెడ్ల దేవి ఆరోపించారు. ఈ అంశంపై తుమ్మల పద్మ నామినేషన్‌ను తిరస్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల పరిశీలన, నిబంధనల ప్రకారం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. పార్టీ తరఫున అభ్యర్థులను ఖరారు చేసి, సీట్ల పంపకాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో నాయకులు ఇలా బహిరంగంగా పోటీ పడటం చర్చకు దారితీస్తోంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన నేతలే తమకు టికెట్ కావాలంటూ పట్టుబడుతుండటం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం బీజేపీ అంతర్గత పరిస్థితిని బయటపెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక సవాలుగా మారిన వేళ, సొంత పార్టీలోనే ఆశావహుల మధ్య పోటీ పెరగడం నాయకత్వానికి కొత్త సమస్య అయ్యింది. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎవరికి పార్టీ మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పెద్దాపురం జెడ్పీటీసీ స్థానంపై వివాదం ఎలా పరిష్కారమవుతుంది, అసంతృప్తి నేతలను బుజ్జగించి పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో నాయకత్వం ఏ మేరకు విజయం సాధిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ నాయకురాలి నామినేషన్ విషయంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం కూడా పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకొంటున్నట్లు తెలిసింది. ఏదైనా విషయం ఉంటే పార్టీ పెద్దలకు తెలియజేయాలని, అంతేకానీ ఫిర్యాదు చేయడం సరికాదని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.


