కాకినాడ రూరల్: అమ్మవారు కాల స్వరూపమని, ఆమె ఆయుష్షును లెక్క కట్టలేమని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద అన్నారు. ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రాణం చాలా విలువైనదనే విషయం తెలుసుకుని మసులుకోవాలని హితవు పలికారు. రమణయ్యపేటలోని శ్రీపీఠంలో నిర్వహిస్తున్న మహాశక్తి యాగానికి మూడో రోజైన మంగళవారం సుమారు 28 వేల మంది భక్తులు తరలివచ్చారు. వారితో స్వామీజీ ఆరోగ్యం సంకల్పం చేయించారు. తొలి రెండు రోజులూ రెండుసార్లు చొప్పున మాత్రమే లలితా నామాలతో కుంకుమార్చనలు చేపట్టగా.. మంగళవారం మూడుసార్లు లలితా నామాలు చదివిస్తూ కుంకుమార్చనలు చేయించారు. మూడు రోజులకు 19 కోట్ల కుంకుమార్చనలు పూర్తయ్యాయని స్వామీజీ తెలిపారు. పది రోజుల దసరా ఉత్సవాల్లో భాగంగా అష్టమి నాటికి వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తవుతాయని చెప్పారు. లలితా సహస్ర నామాలను విడవవద్దని, అవి మహాశక్తికి ప్రతీక అని అన్నారు.


