14 ఏళ్లుగా విలీన పంచాయితీ! | - | Sakshi
Sakshi News home page

14 ఏళ్లుగా విలీన పంచాయితీ!

Oct 12 2026 3:55 AM | Updated on Oct 12 2026 3:55 AM

● అటు కార్పొరేషన్‌లో చేరక..

● ఇటు పంచాయతీలోనూ లేక..

● గాలిలో దీపంలా ఆరు గ్రామాలు

● 66 డివిజన్ల పునర్విభజనలోనూ

దక్కని స్థానం

● స్థానిక ఎన్నికల నిర్వహణ సందిగ్ధమే

కాకినాడ రూరల్‌: కాకినాడ కార్పొరేషన్‌, విలీన ప్రతిపాదిత గ్రామాల ప్రజల్లో స్థానిక ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. గ్రామీణ మండలంలో 14 ఏళ్లుగా స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఆరు గ్రామాలతో పాటు స్వామినగర్‌, ఎస్‌.అచ్యుతాపురం ప్రజలు కార్పొరేషన్‌లో విలీనం కాక, పంచాయతీగా కొనసాగక రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. కార్పొరేషన్‌లో ప్రతిపాదిత గ్రామాల విలీనానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు పురపాలక శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం, సదరు గ్రామాలు తమ ఆధీనంలో లేవని పంచాయతీరాజ్‌ విభాగం అడ్వకేట్‌ జనరల్‌ నివేదిక ఇవ్వకపోవడంతో ఆయా గ్రామాల పంచాయితీ ఎటూ తేలడం లేదు.

15ఏళ్ళగా జాప్యం:

కాకినాడ రూరల్‌ మండల పరిధిలోని రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, స్వామినగర్‌, ఎస్‌.అచ్యుతాపురం గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేసేందుకు 2012లో ఆయా గ్రామాల పాలకవర్గాలు, ప్రత్యేక అధికారులు తీర్మానాలు చేయగా స్వామినగర్‌, ఎస్‌.అచ్యుతాపుం గ్రామాల టీడీపీ నేతలు తమను పంచాయతీలుగానే ఉంచాలని కోర్టుకెక్కడంతో 2017లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ గ్రామాలను చేర్చలేదు. దీంతో అవి నేటికీ ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. తరువాత ఇద్దరు నాయకులు తమ పిటిషన్లను ఉప సంహరించుకున్నప్పటికీ మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ ద్వారా న్యాయ స్థానాల నుంచి నేటికీ ఆయా వ్యాజ్యాలపై తుది నిర్ణయాన్ని తీసుకురాలేదు.

ప్రతిపాదిత విలీన గ్రామాల పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టివేయడంతో తమ గ్రామాల్లోనూ ఎన్నికలు జరుగుతాయని ప్రజలు భావించారు. కానీ ఆ విషయమై నేటికీ స్పష్టత లేదు. తాజాగా కార్పొరేషన్‌ అధికారులు ప్రస్తుతమున్న 50 డివిజన్లను 66గా పెంచి ఈ నెల 14వ తేదీ లోగా అభ్యంతరాలు తెలపాలని పిలుపునిచ్చారు. అయితే ఆ 66 గ్రామాల్లో స్వామినగర్‌, ఎస్‌ అచ్యుతాపురం గ్రామాలను పరిగణనలోకి తీసుకోకపొవడం గమనార్హం. అయితే రమణయ్యపేట, వాకలపూడి, తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ గ్రామాలను ఏ డివిజన్లలో కలుపుతారన్నది నేటికీ సందిగ్ధంగానే ఉంది. ఈ విషయమై స్థానిక పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు శనివారం బ్యాండేజీ కట్లతో 8 విలీన గ్రామాలతో కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించాలని నినదించారు.

42, 48 డివిజన్లపై నిర్లక్ష్యం

డివిజన్ల పునర్విభజనలో 42వ డివిజన్‌లోని స్వామినగర్‌, 48వ డివిజన్‌లోని ఎస్‌.అచ్యుతాపురంపై కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులు పిటిషన్లు విరమించుకున్నప్పటికీ న్యాయస్థానం నుంచి అనుమతి లేదు. మున్సిపల్‌ స్టాండింగ్‌ కమిటీ సత్వర చర్యలు తీసుకుని ఎన్నికలు జరిగేలా చూడాలి.

– పెదపాటి నాగబాబు, 48వ డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement