బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్‌లో రైతులకు సహకార వ్యవస్థ ద్వారా పంట రుణాలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నుంచి లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయకపోవడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో డీసీసీబీ ద్వారా రైతులకు సుమారు రూ.550 కోట్ల మేర పంట రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ సుమారు రూ.325 కోట్ల మేర మాత్రమే మంజూరు చేశారు. మిగిలిన రుణాల మంజూరుకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో, లక్ష్యం మేరకు రుణాల మంజూరు సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటి వరకూ కేవలం లక్ష మంది లోపు రైతులకు మాత్రమే రుణాలు మంజూరు చేశారు. ఇచ్చిన రుణాల్లో కూడా సగానికి పైగా గతంలో తీసుకున్నవి రెన్యువల్ చేసినవేనని రైతులు అంటున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రం నిధుల కొరత కారణంగా అనేక సహకార సంఘాల్లో రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
సహకార సంఘాల చుట్టూ ప్రదక్షిణలు
గ్రామీణ రైతులు పంట రుణాల కోసం ప్రధానంగా డీసీసీబీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలనే ఆశ్రయిస్తారు. అయితే, ప్రస్తుతం కొన్ని సంఘాల్లో కొత్త రుణాల మంజూరు నిలిచిపోయింది. రుణం కోసం దరఖాస్తు చేసుకుని రోజుల తరబడి తిరిగినా ఫలితం లేకపోవడంతో పంట పెట్టుబడుల కోసం బయట అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల నుంచి తక్కువ వడ్డీకి రుణం లభించకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. దీంతో పంట చేతికొచ్చేలోపే అప్పుల భారం మీద పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆప్కాబ్ వైపు చూపులు
సహకార సంఘాల ద్వారా కొత్త రైతులకు రుణాలు అందించాలంటే డీసీసీబీకి తగినన్ని నిధులు అవసరం. అయితే, గతంలో తీసుకున్న రుణాలను కొంత మంది సక్రమంగా చెల్లించకపోవడంతో నిధుల సమీకరణలో ఇబ్బందులు ఏర్పడ్డాయని సమాచారం. దీంతో, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) నుంచి నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి డీసీసీబీకి ఏర్పడిందని సహకార రంగ వర్గాలు చెబుతున్నాయి. డీసీసీబీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు కొత్తగా రైతులకు రుణాలు అందించేందుకు అవసరమైన నిధులు సమకూర్చాలని ఆప్కాబ్‌ను డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కోరినట్లు సమాచారం.
బినామీ రుణాలే కారణమా?
ఫ ఖరీఫ్‌లో డీసీసీబీ
రుణ పంపిణీ లక్ష్యం రూ.550 కోట్లు
ఫ ఇప్పటి వరకూ ఇచ్చింది రూ.325 కోట్లు
ఫ మరో వారంలో ముగియనున్న గడువు
ఫ పాత అప్పు చెల్లిస్తే కొత్తగా మంజూరు
గత రెండేళ్లుగా కొన్ని సహకార సంఘాల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసినప్పటికీ, వాటిలో కొన్ని సక్రమంగా వసూలు కాలేదు. అందువల్లనే ప్రస్తుతం కొత్త రుణాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేశారన్న ఆరోపణలు సహకార రంగంలో చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని కొన్ని సహకార సంఘాలు తమ పరిధికి మించి రుణాలు మంజూరు చేశాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఏలేశ్వరం సహకార సంఘంలో సుమారు 2,500 మంది రైతులకు రుణాలు ఇచ్చినట్లు రికార్డులు ఉన్నాయి. కానీ, దాదాపు వెయ్యి మంది రైతులకు సంబంధించిన పత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 1,500 మందికి సంబంధించిన డాక్యుమెంట్లు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల రికవరీ చర్యల్లో భాగంగా డీసీసీబీ అధికారులు పరిశీలనలు నిర్వహించిన సందర్భంగా కొన్ని బినామీ రుణాలు గుర్తించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గండేపల్లి, లంపకలోవ సహకార సంఘాల్లోనూ కోట్లాది రూపాయల రుణాలు బకాయిలుగా ఉండటంతో రికవరీ సమస్యగా మారిందన్న ఆరోపణలున్నాయి.


